● అందరూ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మం సహకారనగర్: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కు కోల్పోకుండా చూడడమే యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్), ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో 24ఏళ్ల తర్వాత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ జరుగుతోందని చెప్పారు. ఈమేరకు 2002 నాటి ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేయగా జిల్లాలో 80 శాతం ఓటర్లు లింక్ అయ్యారని తెలిపారు. అయితే, ఇందులో 30 శాతం మంది పేర్లలో తేడాలు ఉన్నందున క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి ధ్రువీకరిస్తామన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వేకు రానుండగా ఓటర్లు తప్పక ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచించారు. లేనిపక్షంలో ఓరు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. మ్యాపింగ్ కాని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు ఎన్నికల సంఘం ఆమోదించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి అందజేయాలని చెప్పారు. 1987 జూలై 1కు ముందు దేశంలో జన్మించిన వారు స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, 1987 జూలై 1నుంచి 2004 డిసెంబర్ 2వ తేదీ మధ్య జన్మించిన వారు ఆ పత్రాలతో పాటు తండ్రి లేదా తల్లి ఒకరి జనన లేదా గుర్తింపు పత్రం సమర్పించాలని వెల్లడించారు. ఇక 2004 డిసెంబర్ 2వ తేదీ తర్వాత జన్మించిన వారైతే తమ పత్రాలతో పాటు తల్లిదండ్రుల ఇద్దరి పత్రాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని కొంత మేర తగ్గించి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నామని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, కాల్వల చివరి ఆయకట్టు ప్రాంతాలు, బోర్‌వెల్ ఆధారిత గ్రామాల్లో వరి సాగు చేస్తే కీలక దశలో ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఈమేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా విస్తృత అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


