● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సరిరామ్
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్‌లో చేపట్టిన సమ్మె సమయాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అడుగులు పడుతున్నాయని, ఇందులో భాగంగా 2021 వేతన సవరణ వచ్చేనెల 1వ తేదీ నుంచి అమలవుతుందని ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఖమ్మంలోని కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు అంశాలపై ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు. త్వరలోనే యూనియన్లను పునరుద్ధరించి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ఎన్నికల నిర్వహించాక, గుర్తింపు పొందిన యూనియన్ నుంచి సభ్యుడిని విలీన కమిటీలోకి తీసుకుంటారని వెల్లడించారు. అలాగే, విలీన ప్రక్రియకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై సమీక్షలు నిర్వహించగా, కార్మికుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని ఆర్‌ఎం వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఆర్‌ఎం వి.మల్లయ్య పాల్గొన్నారు.
గ్యాస్ వినియోగదారుల ఈ కేవైసీ తప్పనిసరి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలోని ఎల్‌పీజీ వినియోగదారులు ఈనెల 30లోగా ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో ఎల్‌పీజీ గ్యాస్ డీలర్‌ను సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
శ్రీవారికి అభిషేకం,
నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూల విరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, అనంతరం పల్లకీ సేవ చేశారు. కాగా, ఈనెల 29 నుంచి జరగనున్న మహా కుంభాభిషేకం ఉత్సవాలకు ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఇరుకులపాటి కృష్ణప్రసాద్ కుటుంబీకులు రూ.1,01,116 విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


