రక్తబంధం ! | - | Sakshi
Sakshi News home page

రక్తబంధం !

Jun 14 2026 7:22 AM | Updated on Jun 14 2026 7:22 AM

చిన్నారుల్లో చిరునవ్వులు..

ఆపదలో ప్రాణదాతలుగా యువత

మూడు నెలలకోసారి రక్తదానం..

వందలాది మందికి ప్రాణం

వాట్సాప్‌ గ్రూపుల ద్వారా

సమాచార మార్పిడి

ఆపదలో ఉన్న వారి కోసం..

20 సార్లు రక్తదానం చేశా..

ఖమ్మం మయూరిసెంటర్‌: రక్తాన్ని పంచుకోవడానికి ఒకే కడుపున పుట్టాల్సిన పనిలేదు.. ఒక ప్రాణాన్ని నిలపాలనే మంచి మనసుంటే చాలు అని నిరూపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన యువత. స్వార్థం లేకుండా, ఎవరనే పరిచయం లేకుండా.. కేవలం శ్వాస ఆగిపోవద్దనే సంకల్పంతో వారు తమ రక్తాన్ని ధారపోస్తున్నారు. ప్రమాదాల్లో మృత్యువుతో పోరాడే క్షతగాత్రులు, కాన్పుల సమయంలో కొట్టుమిట్టాడే తల్లులకే కాదు.. మా ఆయుష్షు పెంచండి అన్నా అంటూ ఆశగా ఎదురుచూసే వందలాది తలసేమియా చిన్నారులకు నడిసొచ్చే సంజీవనిలా మారుతున్నారు. ఆపదలో ఉన్నారనే కబురు అందితే చాలు.. పనులన్నీ పక్కనబెట్టి పరుగున ఆస్పత్రులకు వెళ్లి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.

వాట్సాప్‌ వేదికగా.. ప్రాణాల రక్షణ!

రక్తదానం విలువ తెలిసిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువకులు గ్రూపులుగా ఏర్పడి నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకున్నారు. పోలీసు శాఖ, మిసైల్‌ మ్యాన్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ (ఎంఎంహెచ్‌), యువ భారత్‌ శక్తి, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, యువజన చేయూత(టేకులపల్లి), హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫర్‌ ద పీపుల్‌, బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌, మధిర స్విమ్మర్‌ అసోసియేషన్‌, కొత్తగూడెం బ్లడ్‌ డోనర్స్‌, చేగువేరా బ్లడ్‌ డోనర్స్‌, ఖమ్మం వాకర్స్‌ గ్రూప్‌ వంటి బృందాలు వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని వేగంగా చేరవేస్తున్నాయి. ఎక్కడ, ఏ గ్రూప్‌ రక్తం ఎవరికి అవసరమున్నా క్షణాల్లో స్పందించి వాలిపోతున్నారు. ప్రతీ మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా బ్లడ్‌ బ్యాంక్‌ల్లో రక్తదానం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 మందికి పైగా తలసేమియా చిన్నారులు నిశ్చింతగా ఉండడానికి రక్తదాతల సహకారమే కారణమని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వైద్యులు చెబుతున్నారు. మరోవైపు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ, రెడ్‌క్రాస్‌ సొసైటీ తదితర సంస్థలు గ్రామీణ ప్రాంతాల యువతను రక్తదానం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

రక్తం దొరకక అల్లాడిపోతున్న తలసేమియా చిన్నారుల కోసం రక్తదాతలు మేమున్నామని ముందుకొస్తున్నారు. వందలాది మంది నిత్యం రక్తదానం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా వందలాది క్యాంపులు నిర్వహిస్తూ తలసేమియా చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ప్రతిఫలం ఆశించకుండా, తమ రక్తాన్ని పంచి పరాయి ప్రాణాన్ని కాపాడుతున్న ఈ రుధిర దాతలంతా ‘సలాం’అనిపించకుంటున్నారు. వీరి స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని వైద్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కోతున్నారు.

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకున్నా. తలసేమియా చిన్నారుల కోసం దృష్ట్యా ప్రతీ మూడు, నాలుగు నెలలకోసారి రక్తదానం చేస్తున్నా. ఇప్పటి వరకు 30సార్లు రక్తదానం చేశా. సహచర ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తున్నా.

– ఎం.సాయిలు, హెడ్‌ కానిస్టేబుల్‌, ఖమ్మం

నా 19వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నాను. నాది ఏ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌. చికిత్స పొందుతున్న వారికే కాక తలసేమియా చిన్నారులకు సైతం రక్తదానం చేస్తున్నా. ప్రతీ మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా ఇప్పటి వరకు 20సార్లు రక్తదానం చేశా.

– కె.వంశీ, రక్తదాత, రీచ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement