అంతర్రాష్ట్ర బస్సులను తిప్పుతాం
ప్రతిపాదనల్లోనే అంతర్రాష్ట్ర డిపో
● ఆదాయం కోల్పోతున్న భద్రాచలం ఆర్టీసీ డిపో ● డ్రైవర్ల కొరతతో క్రమంగా తగ్గిపోతున్న సర్వీసులు ● సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల సర్వీసులు.. ● పదుల సంఖ్యలో సర్వీసులతో సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్
భద్రాచలం: వనరులు ఉన్నా సిబ్బంది కొరత వల్ల భద్రాచలం ఆర్టీసీ డిపో ఆదాయం కోల్పోతోంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలాన్ని అంతర్రాష్ట్ర డిపోగా మార్చాలనే డిమాండ్ ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. మరో వైపు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి భద్రగిరి మీదుగా బస్సుల ను తిప్పుతూ ప్రైవేటు ట్రావె ల్స్ సొమ్ము చేసుకుంటున్నా యి. కాగా, ముక్కోటి, శ్రీరామ నవమి ఉత్సవాలే డిపోకు శ్రీరామరక్షగా మారాయి.
సరిహద్దు ఏపీకి ఆ రాష్ట్ర సర్వీసులే
విభజనకు ముందు భద్రాచలం డిపో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదాయంలో ముందుండేది. 9 మండలాలతో కళకళలాడేది. ఇక్కడి నుంచి కుక్కునూరు, చర్ల, వెంకటాపురం, వాజేడు, పేరూరు, కూనవరం, రేకపల్లి, చింతూరు ప్రాంతాలకు నిత్యం ఎర్ర బస్సులు తిరిగేవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో పరిస్థితి తారుమారైంది. ఉద్యోగుల బదలాయింపుతోపాటు సర్వీసులు కుదించారు. దీంతో రేకపల్లి, చింతూరు, కుక్కునూరు సర్వీసులను ఎత్తివేశారు. రాజమండ్రి వైపు వెళ్లే సర్వీసులను తగ్గించారు. ఇదే అవకాశంగా ఆంధ్రప్రదేశ్‌లోని గోకవరం తదితర డిపోల నుంచి సర్వీసులు పెంచి ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆదాయం పొందుతోంది.
డ్రైవర్ల కొరతతో ఇక్కట్లు
ముక్కోటి, శ్రీరామనవమి రోజుల్లో ఆదాయం వస్తుండటంతో భద్రాచలం డిపో లాభాల్లో నడుస్తోంది. ఉత్సవాల సమయంలో మినహా మిగతా రోజుల్లో నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. డిపోలో డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం డిపోలో 107 బస్సులు సర్వీసులు ఉన్నా మరమ్మతుల నేపథ్యంలో 103 సర్వీసులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. వీటికి 225 మంది డ్రైవర్లు, సిబ్బంది ఉండాల్సి ఉండగా, కేవలం 193 మంది మాత్రమే ఉన్నారు. 32 మంది లోటుతో సర్వీసులు నడపాల్సివస్తోంది. దీంతో డ్రైవర్లతో డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. కాంట్రాక్ట్ డ్రైవర్లకు జిల్లాలోనే విధులు కేటాయించాలని నిబంధనలు ఉండటంతో సమస్య మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో సర్వీసులను రద్దు చేస్తూ ఆర్టీసీ ప్రజలకు దూరమవుతోంది. బస్సుల పెంపుపై దృష్టిసారించాల్సిన ఆర్టీసీ.. ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, దుకాణాలు అద్దెకు ఇవ్వటంపై చొరవ చూపడం గమనార్హం.
భద్రాచలం, ఒడిశాల మధ్య బస్సులు తిప్పేందుకు మళ్లీ సర్వే నిర్వహిస్తాం. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిహద్దు, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటాం. డ్రైవర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
–జంగయ్య, డిపో మేనేజర్, భద్రాచలం
భద్రాచలం పుణ్యక్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. సరిహద్దు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. వీటితోపాటు తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. ఆ దిశగా ఆర్టీసీ కనీసం ప్రణాళికలు రూపొందించలేదు. రెండేళ్ల క్రితం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నడుమ బస్సులు నడపాలని ఒప్పందం కుదుర్చుకున్నా అమల్లోకి రాలేదు. మరో వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిత్యం పదుల సంఖ్యలో తిరుగుతున్నాయి. ఏసీ, స్లీపర్ వంటి అధునాతన సౌకర్యాలతో సుమారు 10 బస్సులు భద్రాచలం మీదుగా ఒడిశాకు వెళ్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ సైతం భద్రాచలం వస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచీ రోజూ పదుల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు, వైద్య, వాణిజ్య కేంద్రమైన భద్రాచలానికి ప్రయాణాకులను తరలిస్తున్నాయి. భద్రాచలం డిపో నుంచి బస్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల డిపోలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయం దండుకుంటున్నాయి. ఇప్పటికై నా తెలంగాణ ప్రభుత్వం భద్రాచలాన్ని అంతర్రాష్ట్ర డిపోగా ఏర్పాటుచేయడమే కాక సర్వీసులు, సిబ్బందిని పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.


