ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలో 27వేల పాఠశాలలకు బదులు 4వేలే సరిపోతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సరికాదని, ఈ ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్లను మూసి వేసే వైఖరిని మానుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ సూచించారు. టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.మల్లయ్య అధ్యక్షతన ఖమ్మంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ కార్డుల విధివిధానాలు రూపొందించి ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని, రిటైర్ అయిన 15 వేలమంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. అంతేకాక సీపీఎస్ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు, హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యంపై స్పందించాలన్నారు. అనంతరం పి.నాగిరెడ్డి, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు, నాయకులు ముత్తయ్య ,శ్యాంసుందర్, వీరబాబు, వెంకటేశ్వరరావు,,ఉమాదేవి, నాగేశ్వరరావు, యాకూబ్ పాషా, కోటేశ్వరరావు, హన్మంతరావు, రాము తదితరులు పాల్గొన్నారు.
కుదింపు ఆలోచన సరికాదు
ప్రభుత్వ పాఠశాలలను కుదించాలనే ఆలోచన సరికాదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని పేర్కొన్నారు. యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన నిర్వహించగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ఇందుకోసం ప్రతీ గ్రామపంచాయతీలో ఒక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయాలన్నారు. అలాగే, నర్సరీ, కేజీ తరగతులను ప్రవేశపెట్టి ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించడమే కాక పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేయాలని కోరారు. నాయకులు పారుపల్లి నాగేశ్వరరావు, జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, వి.రాంబాబు, బి.రాందాస్, డి.నాగేశ్వరరావు, పి.సురేష్, ఉద్దండ్, రామారావు, సుధాకర్, ప్రశాంతి పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విజయ్


