సర్‌మని సాగిపోయేలా... | - | Sakshi
Sakshi News home page

సర్‌మని సాగిపోయేలా...

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

● బీఎల్‌ఓల వద్ద ఓటర్లు పేర్లు చూసుకునే అవకాశం ● జిల్లాలో 60వేల మంది ఓటర్ల పేర్లలో తప్పుల సవరణ ● కల్టెకర్‌ దివాకరకు ఎన్నికల సంఘం ప్రశంసలు

77 శాతం మ్యాపింగ్‌ పూర్తి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌ – స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) మ్యాపింగ్‌లో జిల్లా యంత్రాంగం కొత్త పంథా అనుసరించి రికార్డు సృష్టించింది. కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ప్రణాళిక, ముందస్తు జాగ్రత్తలతో ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌ సులభతరం కానుంది. ఈనెల 15వరకు బీఎల్‌ఓల వద్ద ఉండే జాబితాలో ఓటర్లు తమ పేర్లు చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఫలితంగా మ్యాపింగ్‌ కాని వారు ముందుగానే సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసుకునే అవకాశముంటుంది. ఇక 2002, 2026 ఓటర్ల జాబితాను సరిపోల్చినప్పుడు ఎదురైనా అక్షర దోషాలను ముందే సరిచేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మ్యాపింగ్‌లో ఖమ్మం మార్క్‌ !
● బీఎల్‌ఓల వద్ద ఓటర్లు పేర్లు చూసుకునే అవకాశం ● జిల్లాలో 60వేల మంది ఓటర్ల పేర్లలో తప్పుల సవరణ ● కల్టెకర్‌ దివాకరకు ఎన్నికల సంఘం ప్రశంసలు

ప్రత్యేక కార్యక్రమం

మ్యాపింగ్‌ కాని ఓటర్ల కోసం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఈనెల 15 వరకు బీఎల్‌ఓల వద్ద ఉన్న జాబితా ఆధారంగా ఓటర్లు మ్యాపింగ్‌ అయ్యాయో, లేదో పరిశీలించుకునే అవకాశం కల్పించారు. తద్వారా మ్యాపింగ్‌ కాని వారు ధ్రువపత్రం సిద్ధం చేసుకుని 24 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల వద్ద కుల ధ్రువపత్రాలు ఉంటాయి. ఓసీలైతే పుట్టిన తేదీ, నివాస ధ్రువపత్రాలు లేదా ఎస్సెస్సీ మెమో అందచేయొచ్చు.

చకచకా సర్టిఫికెట్లు జారీ

సర్టిఫికెట్లు సిద్ధంగా లేని వారికి ఈనెల 30లోగా జారీ చేయాలని కలెక్టర్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఓటర్ల దరఖాస్తుల పరిశీలన, అర్హత తేలితే వెంటనే జారీ చేసేలా రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఈనెలాఖరు వరకు ఉండేలా ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు.

అక్షర దోషాల సవరణ

రెండు ఓటర్ల జాబితాల పరిశీలన సందర్భంగా పేర్లు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు సమస్యగా మారాయి. ఇలాంటి ఓటర్లు జిల్లాలో 2.30 లక్షల మంది ఉన్నారు. ఉదాహరణకు 2026 జాబితాలో ఓ ఓటరు తండ్రి పేరు వెంకటేశ్వర్‌ అని ఉంటే, 2002 జాబితాలో వెంకటేశ్వర్లుగా నమోదైంది. కొన్నిచోట్ల ఇంటి పేరు లేదు. అలాగే, కృష్ణమూర్తికి బదులుగా.. కష్టమూర్తి, కిస్నమూర్తి అని నమోదయ్యాయి. కొన్నిచోట్ల కొత్తగా పెళ్లి అయిన మహిళ పేరును అత్తమామల జాబితాతో మ్యాపింగ్‌ చేశారు. ఆ పేరును ఆమె తల్లిదండ్రులతో మ్యాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను యంత్రాంగం గుర్తించగా, కలెక్టర్‌ దివాకర చొరవతో మూడు రోజుల్లోనే 60 వేల సమస్యలను పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఈ కేటగిరీలో ఖమ్మం జిల్లాలోనే అతితక్కువ సమస్యలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇక్కడ ఎలా చేశారని ఆరా తీయడమే కాక కలెక్టర్‌ దివాకరను అభినందించారు. అంతేకాక ఇతర జిల్లాలోనూ ఖమ్మం ఫార్ములా అనుసరించాలని సూచించడం విశేషం.

ఎస్‌ఐఆర్‌కి సంబంధించి 2002–2026 ఓటర్ల జాబితాను సరిపోలుస్తున్నారు. వీటిలో పేర్లు ఉన్నా, తల్లిదండ్రుల పేర్లు ఉన్న ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తవుతుంది. 2002 జాబితాలో పేర్లు లేకపోతే అన్‌ మ్యాపింగ్‌గా నమోదు చేస్తారు. ఆపై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. ఈమేరకు జిల్లాలో 77 శాతం మ్యాపింగ్‌ పూర్తయింది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12,44,555 మంది ఓటర్ల పేర్లను పరిశీలించగా 2002 నాటి జాబితాలో 9.50 లక్షల మంది ఉన్నట్లు తేల్చారు. అయితే, వీరిలో 20 శాతం మంది పేర్లు, ఇంటి పేర్ల అక్షరదోషాలు ఉన్నాయని గుర్తించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement