రైతు సంక్షేమానికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి పెద్దపీట

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

● రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో రికార్డు ● అధికారుల సూచనలతో పంటలు సాగు చేయాలి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికారుల సూచనలు పాటించండి

● రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో రికార్డు ● అధికారుల సూచనలతో పంటలు సాగు చేయాలి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తిరుమలాయపాలెం: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుమలాయపాలెం సబ్‌స్టేషన్‌లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే 0.8 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రానికి అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆతర్వాత ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేయగా, రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని చెప్పారు. అంతేకాక సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తూ రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇదేకాక దివంగత సీఎం వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో ఉచిత విద్యుత్‌ అమలుచేయడమే కాక ఇతర సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాగా, రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లు మంజూరు చేస్తామని, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు ఉండదని స్పష్టం చేశారు.

వారిది మొసలికన్నీరు

నేలకొండపల్లి: సమస్యలపై ప్రశ్నించిన రైతులకు సంకెళ్లు వేసిన గత పాలకులు, ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలం బైరవునిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రైతుల కష్టం తెలియని వాళ్లు, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన లేని వారికి మాట్లాడే హక్కు లేదని తెలిపారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన కాటమయ్య దేవాలయాన్ని మంత్రి సందర్శించి పూజలు చేయగా ఆలయ చైర్మన్‌ పోలంపల్లి నాగేశ్వరరావు సన్మానించారు. అంతేకాక బుద్ధారంలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి, రాయగూడెంలో అనారోగ్యంతో బాధపడుతున్న కొర్లకుంట్ల నాగేశ్వరరావు తదితరులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచారి, డీఏఓ డి.పుల్లయ్య, నేలకొండపల్లి మార్కెట్‌ చైర్మన్‌ వెన్నపూసల సీతారాములు, ఏడీఏ సతీష్‌, తహాసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌, ఆత్మ, బీరోలు పీఏసీఎస్‌ చైర్మన్లు చావా శివరామకృష్ణ రామసహాయం నరేష్‌రెడ్డితో పాటు నాయకులు కొడాలి గోవిందరావు, శాఖ మూరి రమేష్‌, భద్రయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యం

ఖమ్మంరూరల్‌: పేదలను ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలుచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులు 76మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఆయన చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సొంతింటి కల సాకారం చేసేలా దశల వారీగా మంజూరు చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.అనిత, కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందనే సూచనలు వస్తున్నందున వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని రైతులు అనుకూలమైన పంటలను సాగు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. అరకొర వర్షాలతో తొందరపడి విత్తనాలు నాటొద్దని తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement