యంత్రాంగం మెతక వైఖరితో
ఆగని దందా
ప్రధాన రహదదారులపైనే
వాహనాల్లోకి డంప్
ఫలితంగా ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు
దెబ్బతింటున్న రహదారులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాక జిల్లా అంతటా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతి లేకుండా కొందరు, కేటాయించిన రూట్లను కాదని ఇంకొందరు ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా రహదారులపైనే ఒక వాహనం నుంచి ఇంకో వాహనంలోకి డంప్ చేస్తుండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
అనుమతి అవసరమే లేదు..
ఖమ్మంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇసుకను తరలించడానికి అధికారికంగా అనుమతులు లేవు. అయినా మున్నేటితో పాటు ఇతర వాగుల నుంచి ఇసుక తరలిపోతోంది. ముదిగొండ ప్రాంతంతోని మున్నేటి నుంచి వందల కొద్ది ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా రాత్రీపగలు తేడా లేకుండా ఇసుక తీసుకెళ్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు వాహనాలను సీజ్ చేసి, జరిమానా విధించి వదిలేస్తుండటంతో మళ్లీ దందా సాగుతోంది.
డిమాండ్ ఆధారంగా..
కొన్నేళ్లుగా జిల్లావ్యాప్తంగా నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇసుక అవసరాలు పెరగడం అక్రమ వ్యాపారులకు కలిసొస్తోంది. డిమాండ్ ఆధారంగా ధర నిర్ణయించి సరఫరా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరు చెప్పుకుని కొందరు ఇసుక పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా ప్రకృతి సంపద కరిగిపోతుండగా, వందలాది వాహనాల రాకపోకలతో రహదారుల వెంట ఉన్న జనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఎప్పుడంటే అప్పుడు...
వర్షం కురిసినా, అధికారుల తనిఖీలు ఉన్నా వాగుల్లోకి వెళ్లి ఇసుక తీసుకురావడం ఆలస్యం అవుతుంది. ఈక్రమాన అక్రమార్కులు సమయం కుదిరినప్పుడే ఇసుక తీసుకొచ్చి ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. ఆతర్వాత ఆర్డర్లఆధారంగా కావాల్సిన చోటకు తరలిస్తున్నారు.
చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా..
ఇటీవలి ఇసుక అక్రమ రవాణా పెరగడంతో పోలీసులు కీలక ప్రాంతాలతో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. దీంతో అక్రమార్కులు ప్రత్యామ్నాయదారులు ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లారీల్లో జిల్లాకే కాక హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర సరిహద్దులైన అశ్వారావుపేట, ముదిగొండ మండల వల్లభి వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న లారీలను సీజ్ చేశారు. అలాగే భద్రాచలంలోని గోదావరి నుంచి కూడా ఇసుక లారీలు వస్తున్నాయి. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. దందా ఆగకపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లా అంతటా యథేచ్ఛగా అక్రమ రవాణా
ఖమ్మంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోయింది. ట్రాక్టర్లు, లారీల్లో ప్రధాన రహదారుల మీదుగానే తరలిస్తున్నారు. దీంతో నూతనంగా వేసిన రహదారులు దెబ్బతింటున్నాయి. మరోవైపు లారీలను నడిరోడ్డుపై నిలిపి.. ట్రాక్టర్ లేదా మరో లారీలోకి డంప్ చేస్తున్నారు. కొత్త బస్టాండ్ పక్కన కేఎంసీ కార్యాలయానికి వెళ్లే దారిలో వాహనాల్లో ఇసుక డంప్ చేసే సమయాన రహదారిపై ఇసుక కుప్ప పడింది. దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు.


