ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న పథకంలో భాగంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ఎంపికై న విద్యార్థుల ధ్రువపత్రాలను ఈ నెల 15న పరిశీలించనున్నట్లు ఎస్సీ డీడీ జి.జ్యోతి తెలిపారు. సీజీజీ–ఈపాస్ నుండి మెస్సేజ్ వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కలెక్టరేట్‌లోని తమ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి సర్టిఫికెట్ల పరిశీలన మొదలవుతుందని ఆమె తెలిపారు.
పోలీసు ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత
ఖమ్మంక్రైం: పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యానికి శాఖ ప్రాధాన్యత ఇస్తోందని సీపీ సునీల్‌దత్ తెలిపారు. ఖమ్మం హెడ్‌క్వార్టర్స్‌లో హైదరాబాద్ యశోద ఆస్పత్రి ఆధ్వర్యాన శుక్రవారం ఉద్యోగులు, వారి కుటుంబీకులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈశిబిరాన్ని ప్రారంభించిన సీపీ మాట్లాడుతూ విధినిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగుల్లో గుండెజబ్బులు, ఇతర సమస్యలను ముందుగా గుర్తించేలా పరీక్షలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈసీజీ, టూ డీ ఎకో తదితర పరీక్షలు చేయించి ప్రొఫెల్ అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ భరత్‌రెడ్డి, యశోద సీనియర్ మేనేజర్ వినయ్‌కుమార్, ఏసీపీలు మహేష్, సుశీల్‌సింగ్, నర్సయ్య, ఆర్‌ఐలు కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
‘ఏక్ పేడ్.. మాకే నామ్’ పోస్టర్లు ఆవిష్కరణ
ఖమ్మం సహకారనగర్: పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల్లో ప్రకృతిపై అవగాహన పెంచే లక్ష్యంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్‌ప్స్(ఎన్‌జీసీ), విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యాన ‘ఏక్ పెడ్ మా కే నామ్(అమ్మ పేరుతో మొక్క నాటడం)’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈమేరకు కార్యక్రమ పోస్టర్లను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతీ విద్యార్థితో తల్లి పేరిట మొక్క నాటించడం ద్వారా బాధ్యతగా సంరక్షిస్తారని, తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫొటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎన్‌జీసీ కోఆర్డినేటర్ ఇనుముల వెంకటేశ్వర్లు, డీపీఓ రాంబాబు, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ పి.ప్రభాకర్‌రెడ్డి, సీఎంఓ ప్రవీణ్‌కుమార్, ఏపీఓ శ్రీనివాసరావు, ఎంఈఓలు పాల్గొన్నారు.


