త్వరలోనే టెండర్లు పిలుస్తాం
● రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల మంజూరు ● వైరా, మధిర నియోజకవర్గాలకు రూ.106 కోట్లు ● దశాబ్దాల తర్వాత పరిష్కారం కానున్న సమస్యలు
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు, వంతెనల పునర్నిర్మాణం, అప్రోచ్ రోడ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈమేరకు రోడ్లు, భవనాల శాఖ ద్వారా మధిర, వైరా నియోజకవర్గాల్లో పనులకు రూ.106.10 కోట్లకు పైగా పరిపాలనా అనుమతులు లభించాయి. ఇందులో మధిర నియోజకవర్గంలో కొత్త వంతెనల నిర్మాణానికి రూ.34.60 కోట్లు కేటాయించగా, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్(ఎఫ్‌డీఆర్) కింద మరో రూ.47.90 కోట్లతో వంతెనల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతేకాక వైరా నియోజకవర్గంలో రూ.23.60 కోట్లతో పలు వంతెనల పునర్నిర్మాణం, కొత్త హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో చేపట్టే పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు దశాబ్దాల కాలంగా వర్షాకాలంలో రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులు తీరనున్నాయి.
ఎర్రుపాలెం: మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారీ వర్షాల సమయాన రోడ్లపైకి వరద చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఎదురవుతోంది. ఈమేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి మండలంలోని ఎనిమిది గ్రామాల్లోని రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణానికి రూ.39 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇందులో ఎర్రుపాలెం – జమలాపురం ఆర్చి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.9.40 కోట్లు, సకినివీడు – ములుగుమాడు రోడ్డులో బ్రిడ్జికి రూ.3.20 కోట్లు, ములుగుమాడు – ఇనగాలి మధ్య వంతెనకు రూ.6.40 కోట్లు, వెంకటాపురం నుంచి గట్ల గౌరారం రోడ్డులో రెండు బ్రిడ్జిలకు రూ.9.45 కోట్లు, బుచ్చిరెడ్డిపాలెం – నర్సింహాపురం రోడ్డులో నర్సింహాపురం (రోడ్డు వంతెన) కెనాల్‌పై బ్రిడ్జికి రూ.1.65 కోట్లు, నరసింహాపురం – రాజుపాలెం రోడ్డులో వంతెనకు రూ.2.30 కోట్లు, మీనవోలు – తొండలగోపవరం రహదారిలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు, భీమవరం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.10 కోట్లు మంజూరయ్యాయి.
బోనకల్: మండలంలోని పలు గ్రామాల మధ్య వాగులపై ఆరు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.25.2 కోట్లు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, పీసీసీ మెంబర్ పైడిపల్లి కిశోర్ తెలిపారు. కలకోట – మోటమర్రి మధ్య ప్రధాన రహదారిలో వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.2 కోట్లు, కలకోట – మోటమర్రి మార్గంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు, రావినూతల – ప్రొద్దుటూరు రోడ్డు మూడు వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి రూ.8 కోట్లు, బోనకల్ – ఆళ్లపాడురోడ్డులో వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టికి వారు కృతజ్ఞతలు తెలపగా, సమావేవంలో మాజీ జెడ్పీటీసీ మోదుగు సుధీర్‌బాబు, సర్పంచ్ భద్రూనాయక్ పాల్గొన్నారు.
మధిర: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదనల మేరకు మండలంలోని పలు వంతెనల (హెచ్‌ఎల్‌బీ) పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభు త్వం నిధులు కేటాయించింది. మాటూరుపేట వద్ద నిధానపురం – మాటూరుపేట రోడ్డుపై హెచ్‌ఎల్‌బీ పునర్నిర్మాణం, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.1.40 కోట్లు, రాయపట్నం బ్రిడ్జి – మోటమర్రి రోడ్డుపై హెచ్‌ఎల్‌బీ పునర్నిర్మాణానికి రూ.3.60 కోట్లు, దేశినేనిపాలెం – ఇల్లూరు రోడ్డుపై హెచ్‌ఎల్‌బీ పునర్ని ర్మాణానికి రూ.2.30కోట్లు కేటాయించారు. అలాగే, దెందుకూరు – ఖమ్మంపాడు మధ్య హెచ్ ఎల్‌బీ పునర్నిర్మాణానికి రూ.5.60 కోట్లు, మధిర – నందిగామ రోడ్డుపై రెండు మైనర్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి రూ.5.50కోట్లు మంజూరయ్యా యని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ వెల్లడించారు.
ఎర్రుపాలెం మండలంలో అవసరమైన మేర రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు గాను త్వరలోనే టెండర్ల ప్రక్రియ మెదలు పడతాం. శాఖాపరంగా టెండర్లు ఖరారు కాగానే త్వరగా పనులు మొదలుపెట్టి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
–రాజేశ్, ఆర్‌అండ్‌బీ, ఏఈ, ఎర్రుపాలెం


