● పెద్ద షాపులే దొంగల టార్గెట్‌ ● రూ.లక్షల విలువైన సొత్తు చోరీ చేసి మాయం ● మంత్రుల పర్యటనలు, ప్రోటోకాల్‌తో పోలీసుల బిజీబిజీ ● ఫలితంగా పెట్రోలింగ్‌ తగ్గి పెరుగుతున్న నేరాలు | - | Sakshi
Sakshi News home page

● పెద్ద షాపులే దొంగల టార్గెట్‌ ● రూ.లక్షల విలువైన సొత్తు చోరీ చేసి మాయం ● మంత్రుల పర్యటనలు, ప్రోటోకాల్‌తో పోలీసుల బిజీబిజీ ● ఫలితంగా పెట్రోలింగ్‌ తగ్గి పెరుగుతున్న నేరాలు

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

● పెద్ద షాపులే దొంగల టార్గెట్‌ ● రూ.లక్షల విలువైన సొత్తు చోరీ చేసి మాయం ● మంత్రుల పర్యటనలు, ప్రోటోకాల్‌తో పోలీసుల బిజీబిజీ ● ఫలితంగా పెట్రోలింగ్‌ తగ్గి పెరుగుతున్న నేరాలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కొద్దిరోజులుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్‌ సృష్టిస్తోంది. ప్రముఖ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రెక్కీ నిర్వహించి మరీ లూటీ చేసి సరిహద్దు దాటేస్తున్నాయి. ఖమ్మంలోని సోనోవిజన్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లో గురువారం తెల్లవారుజామున ఏకంగా రూ.66లక్షలకు పైగా విలువైన 200 సెల్‌ఫోన్లను అపహరించడం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఇదే భారీ దొంగతనంగా భావిస్తున్నారు. గత నెలలో కూడా ఖమ్మంలో ఓ వ్యాపారి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించారు. కరీంనగర్‌లోని పీఎంజే జ్యూవెలరీ షాప్‌ చోరీ కేసులో పట్టుపడిన నిందితులు ఖమ్మంలోనూ రెక్కీ నిర్వహించామని ఒప్పుకోవడం.. ఆపై వరుసగా చోరీలు జరుగుతుండడం జిల్లావాసులను ఆందోళనకు గురి చేస్తోంది.

మకాం వేశారా?

కొద్దినెలలుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఖమ్మంలో మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌ పీఎంజే జ్యూయలరీ కేసు నిందితులు తొలుత ఖమ్మంలో రెక్కీ నిర్వహించామని అంగీకరించిన విషయం తెలిసిందే. అలాగే మే 21న గాంధీచౌక్‌లో వ్యాపారి కార్తీక్‌ తన బైక్‌పై ఉంచిన రూ.40 లక్షల విలువైన ఆభరణాల చోరీ జరిగింది. ఈ కేసులోనూ నిందితులు ఖమ్మంలోని ఓ లాడ్జీలో మకాం వేసి చుట్టుపక్కల జిల్లాల్లో దొంగతనాలకు ప్రణాళిక వేసినట్లు తెలిసింది. నల్లగొండలోని ఓ బ్యాంక్‌ ముందు పట్టుపడిన దొంగలు కూడా ఖమ్మంలోనే కొన్నాళ్లు ఉన్నట్లు సమాచారం.

సులువుగా సరిహద్దు దాటేలా..

అంతర్రాష్ట్ర ముఠాలు రూ.కోట్లలో సొత్తు దోపిడీకి బంగారు షాపులు, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలి.. ఎటువైపు నుంచి పారిపోవాలి.. ఏయే రోడ్లు సురక్షితమనే అంశాలను బేరీజు వేసుకున్నాక రంగంలోకి దిగుతున్నట్లు సమాచా రం. గత నెలలో వ్యాపారి వద్ద బంగారు ఆభరణాల చోరీ, గురువారం సోనోవిజన్‌ ఎలక్ట్రానిక్స్‌ షాపులో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తోంది. సోనోవిజన్‌ షాపులో చోరీకి పాల్పడిన వారు ఏపీ రిజిస్ట్రేషన్‌ కారులో వచ్చి ఆంధ్రప్రదేశ్‌ వైపునకు పారిపోయినట్లుపోలీసులు గుర్తించారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త హైవే నిందితులకు కలి సొస్తున్నట్లు భావిస్తున్నారు.

ప్రోటోకాల్‌తో బిజీ... తగ్గిన పెట్రోలింగ్‌

ఖమ్మం నగరంతోపాటు జిల్లాలో ఇటీవల చోరీల సంఖ్య పెరుగుతోంది. అపార్ట్‌మెంట్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌లపై దుండగులు కన్నేసి చిన్నచిన్న దొంగతనాలు కాకుండా భారీ స్థాయిలో సొమ్ము కొల్లగొట్టేందుకు నిందితులు స్కెచ్‌ వేసినట్లు ఇటీవలి ఘటనల ద్వారా తెలుస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఇటీవల పోలీసుల పెట్రోలింగ్‌ తగ్గినట్లుగా ప్రజలు చెబుతున్నారు. గతంలో రాత్రి సమయాన కాలనీల్లో పోలీస్‌ పెట్రోలింగ్‌ ఉండేదని, పోలీసు వాహనాల సైరన్ల మోత మోగేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. కాగా, ప్రభుత్వపరంగా కార్యక్రమాలు, బందోబస్తులో పాల్గొనాల్సి ఉండడంతో పోలీసులు బిజీబిజీగా ఉంటున్నట్లు సమాచారం. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకరు వస్తుండడంతో వారికి బందోబస్తు నిర్వహించాల్సి వస్తోంది. ఈనేపథ్యాన కేసుల దర్యాప్తు, పెట్రోలింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నట్లు సమాచారం. అంతేకాక పెరిగిన నివాస ప్రాంతాల ఆధారంగా తగిన సిబ్బంది లేకపోవడం కూడా శాంతిభద్రతలపై ప్రభావం పడుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement