● సెల్‌ఫోన్లతో పాటు ఇతర పరికరాల అపహరణ ● షట్టర్ తెరిచి.. సాఫీగా సర్దుకున్న నిందితులు
ఖమ్మంక్రైం: ఖమ్మం వైరా రోడ్డులో ఉన్న సోనోవిజన్ షోరూంలో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. షోరూం నుంచి విలువైన 200 సెల్‌ఫోన్లతోపాటు ఇతర సామగ్రిని నిందితులు ఎత్తుకెళ్లారు. సుమారు రూ.66.90లక్షల విలువైన సొత్తు చోరీ అయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దర్జాగా షట్టర్ తెరిచి...
జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి అయిన వైరా రోడ్డులో సోనోవిజన్ షోరూం కొనసాగుతోంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో కారులో వచ్చిన దుండగులు తెల్లవారుజామున 3–30గంటలకు దర్జాగా షట్టర్ తాళాలు పగులగొట్టి తెరిచారు. ఆపై ర్యాక్‌ల్లో ఉన్న ఆపిల్, ఇతర కంపెనీల 200 ఫోన్లతో పాటు చార్జర్లు, అడాప్టర్లు వంటివి సర్దుకుని ఎత్తుకెళ్లారు.
ముందే తెలిసిందా ?
సోనోవిజన్ షోరూమ్‌కు బుధవారమే విలువైన సెల్‌ఫోన్ల స్టాక్ వచ్చింది. ఈ విషయమై దుండగులకు ఇక్కడి ఉద్యోగులు లేదా.. ఇంకెవరైనా సమాచారం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. అందుకే ఫోన్లు తప్ప ఇతర వస్తువులేవీ చోరీ చేయకపోవడం, ఫోన్లు అయితేనే సులువుగా తీసుకెళ్లవచ్చనే భావనతో ఈ పనిచేసి ఉండొచ్చని సమాచారం. రహదారిపై వెళ్తున్న వారెవరైనా చూసినా ఉద్యోగులే పని చేసుకుంటున్నారనే భావన వచ్చేలా షోరూమ్ షట్టర్ పూర్తిగా తెరిచినట్లు సమాచారం.
పోలీసులకు సమాచారం ఇవ్వలేదా?
విజయవాడ నుంచి సమాచారం అందగానే ఖమ్మం ఉద్యోగులు డయల్ 100కు కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వకుండా నేరుగా షోరూమ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికే దుండగులు వెళ్లిపోతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైందని సమాచారం. కాగా, దుండగుల కారు జాడల వైరా వరకు మాత్రమే సీసీ టీవీల్లో కనిపించగా, ఆతర్వాత ఎటు వెళ్లిందో గుర్తించలేకపోయారు. కారు నంబర్ ప్లేట్ ఏపీ రిజిస్ట్రేషన్ ఉండడంతో వైరా నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి చేరుకుని ఏపీలోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. చోరీ విషయం తెలియగానే ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్, ఏపీపీ రమణమూర్తి ఆధ్వర్యాన క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి దర్యాప్తు ఆరంభించారు. ఇదే క్రమాన చోరీ జరిగిన షోరూమ్‌తో పాటు ఇతర బ్రాంచ్‌ల్లోని సిబ్బందిని కూడా విచారిస్తున్నట్లు తెలిసింది.


