రహదారులపై పశువులను వదిలితే చర్యలు
● రహదారులపైకి చేరుతుండడంతో ఇక్కట్లు ● పట్టించుకోని జీవాల యజమానులు ● అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
చుంచుపల్లి: రహదారులపై మూగజీవాల సంచారం నానాటికీ పెరుగుతోంది. రాత్రింబవళ్లు గుంపులుగా తిష్ట వేస్తున్న పశువులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొందరు యజమానులు పట్టింపు లేకుండా వాటిని వదిలిపెడుతుండడంతో అవి రోడ్లపైకి చేరి వాహనదారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. పల్లెల్లో కాస్త నియంత్రణలో ఉన్నా పట్టణాల్లో పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. పశువుల సంచారంపై పంచాయతీ, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని జనం మండిపడుతున్నారు. కొన్నిచోట్ల పశువులు రహదారులపై బైఠాయిస్తుండగా, ఇంకొన్ని చోట్ల పరిగెత్తి వస్తుండడంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.
చర్యలు కరువు...
మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో పశువుల సమస్యను అరికట్టడానికి కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పశువులు రోడ్లపైకి వస్తే మొదటి తప్పుగా రూ.వేయి నుంచి రూ.5వేల వరకు యజమానులకు జరిమానా విధించొచ్చు. యజమానుల నిర్లక్ష్యంతో ప్రాణనష్టం జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఈ నిబంధనలను అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతేకాక పశువుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై యజమానులకు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం.
రోడ్లే ఆవాసం
గ్రామీణ రహదారుల్లోనే కాక పట్టణాలు, నగరాల్లో ప్రధాన రహదారుల్లో కూడా పశువులు తిష్ట వేస్తున్నాయి. హోటళ్లలో యజమానులు పడేసే ఆహారం, కూరగాయలు తింటుండగా.. ఇంకొందరు భక్తితో పెట్టే బియ్యం, అన్నం, పండ్లు తింటూ కాలం గడుపుతున్నాయి. కొన్నింటిని యజమానులే మేత కోసం వదులుతుండగా.., ఇంకొన్ని పశువులు ఎవరివో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొందరు యజమానులు పశువులకు మేత పెట్టలేక రోడ్లపైకి వదిలేస్తుండడంతో వాహనదారులకు శాపంగా మారుతోంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ఇక రాత్రి పూట సమీపానికి వెళ్లే వరకు రహదారులపై గేదెలు కానరాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఇంకొన్ని చోట్ల భారీ వాహనాలు ఢీకొడుతుండడంతో మూగజీవాలు సైతం గాయపడుతున్నాయి.
అశ్వారావుపేట మండలం నారాయణపురం సమీపాన ఇటీవల ద్విచక్రవాహనంపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న కారం దుర్గారావు(32) రహదారిపై గేదెలను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
మణుగూరు పీవీ కాలనీకి చెందిన చింతల ఎల్లమ్మ(80) గత మంగళవారం ఇల్లెందు వెళ్లడానికి బస్టాండ్‌కు బయలుదేరింది. రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ ఎల్లమ్మపై పడడంతో తీవ్రగాయాలతో కన్నుమూసింది.
యజమానులు ఇస్టారాజ్యంగా పశువులను రహదారులపైకి వదిలేస్తున్నారని తెలిసింది. దీని వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆవులు, గేదెలు గుంపులు,గుంపులుగా తిష్ట చేయటమే కాకుండా వచ్చిపోయే ప్రజలు, వాహనదారులపై దాడులకు దిగుతున్నాయి. దీని విషయంలో పశువుల యజమానులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తాం.
– ఎం.విద్యాచందన, డీపీఓ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గేదెను బైక్ ఢీకొనడంతో ఘటన
పెనుబల్లి: మండలంలోని లింగగూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. లింగగూడెంకు చెందిన స్నేహితులు పద్దం విష్ణు(19), విరపా గోపరాజు ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన మరో మిత్రుడు మిడియం శివ(19)ను వీఎం బంజర్‌లో ద్విచక్రవాహనం ఎక్కించుకున్నారు. ఆపై లింగగూడెం వస్తుండగా ఆకస్మాతుగా రోడ్డుపైకి వచ్చిన గేదెను బలంగా ఢీకొట్టి గాలిలో ఎగిరి పడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108 సిబ్బంది పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, బైక్ నడుపుతున్న విష్ణు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆతర్వాత మిడియం శివ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక గాయాలైన గోపరాజును మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు.


