సమస్యలపై నిరంతర పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై నిరంతర పోరాటాలు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

● బీజేపీ తీరుతో పతనం.. హామీల అమల్లో కాంగ్రెస్‌ ఆలస్యం ● కలెక్టరేట్‌ ముట్టడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

● బీజేపీ తీరుతో పతనం.. హామీల అమల్లో కాంగ్రెస్‌ ఆలస్యం ● కలెక్టరేట్‌ ముట్టడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ధరల పెరుగుదలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యాన బుధవారం ర్యాలీ, కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. వి.వెంకటాయపాలెం స్టేజీ వద్ద నుంచి ప్రదర్శనగా వచ్చిన పార్టీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు బయట దాదాపు రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు.

ప్రజలను విస్మరించి కార్పొరేట్ల కోసం..

కేంద్రంలోని మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో దేశం ఆర్థిక పతనం దిశగా పయనిస్తోందని కూనంనేని పేర్కొన్నారు. సంపన్నులు, వ్యాపారులపై పన్నులు విధించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేయాల్సి ఉన్నా, మోదీ పేదలపై భారాలు మోపి సంపన్నులు, కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తోందని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కాక గ్యాస్‌ ధరలు ఏడాదిలో మూడు సార్లు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్రో ధరలను నియంత్రించే అవకాశం ఉన్నా అదే ఆదాయ వనరుగా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, పింఛన్ల పెంపు, పూర్తి స్థాయిలో రైతు భరోసా జరగలేదన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పటివరకు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో ఆందోళన బాట పట్టామని కూనంనేని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పులను ఎరగా చూపుతూ పథకాల అమలును వాయిదా వేయడం సరికాదని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రా బాబు, ఎస్‌.కే.జానీమియా, నాయకులు బీ.జీ.క్లెమెంట్‌, సిద్దినేని కర్ణకుమార్‌, శింగు నర్సింహారావు, పోటు కళావతి, కర్నాటి భానుప్రసాద్‌, తాటి వెంకటేశ్వరరావు, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement