ఖమ్మం సహకారనగర్: మెడికల్ అకాడమీలు, ట్యూషన్ పాయింట్లలో ఇంటర్‌మీడియట్ ప్రవేశాలకు బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి కె.రవి బాబు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి అనుమతి ఉన్న కాలేజీల్లో పిల్లలను చేర్పించాలని తెలిపారు. ఈ కాలేజీల జాబితాను tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చన్నారు. ఎవరైనా నిర్వాహకులు కాలేజీలో అడ్మిషన్ చేయించి.. అకాడమీ, ట్యూషన్ పాయింట్లలో తరగతులకు పంపినట్లు తేలితే కళాశాలల యజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని డీఐతో తెలిపారు.
కరాటేతో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ
ఖమ్మం స్పోర్ట్స్: కరాటే శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నెల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఈసందర్భంగా డీవైఎస్‌ఓ మాట్లాడుతూ కరాటే శిక్షణ బాలికల ఆత్మరక్షణకు ఉపయోగపడతుందని చెప్పారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కరాటే మాస్టర్ జి.రాము, మేనేజర్ ఉదయ్‌కుమార్, ఇన్‌స్ట్రక్టర్లు జె.హరీష్, మణి పాల్గొన్నారు.
గంజాయి రహిత
సమాజమే లక్ష్యం
ఖమ్మంవైద్యవిభాగం: గంజాయి అమ్మకాలు, వాడకాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని అడిషనల్ డీసీపీ రామానుజం సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యాన మాదక ద్రవ్యాల నియంత్రణపై బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా జనరల్ ఆస్పత్రిలోని డీ అడిక్షన్ సెంటర్ వద్ద అడిషనల్ డీసీపీ మొక్కలను నాటారు. ఆతర్వాత ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి యువత, విద్యార్థులు దూరంగా ఉండడమే కాక వాటితో నష్టాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, అమ్మేవారి సమాచారం తెలిస్తే తమకు అందించాలని తెలిపారు. గంజాయి వినియోగం, రవాణాకు పాల్పడితే తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చెప్పారు. ఈకార్యక్రమంలో ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు.


