ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

● మూడేళ్ల చిన్నారి మృతి, మరో నలుగురికి గాయాలు ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

● మూడేళ్ల చిన్నారి మృతి, మరో నలుగురికి గాయాలు ● దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

పాల్వంచరూరల్‌/మధిర: ఏపీలోని శ్రీకాకుళం నుంచి మధిరలో ఉంటున్న వైద్యుడి వద్దకు ఆయన తల్లిదండ్రులు, సోదరి, మేనకోడలు వచ్చారు. మేనకోడలికి గొంతు సంబంధిత శస్త్రచికిత్స చేయించారు. చికిత్స విజయవంతం కావడంతో భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాలని కారులో వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదం బారిన పడ్డారు. దీంతో చిన్నారి మృత్యువాత పడగా మిగతా వారికి తీవ్రగాయాలైన ఘటన పాల్వంచలో బుధవారం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం నుంచి పాల్వంచకు..

ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన పద్మావతి – కృష్ణారావుల కుమార్తె హావియాకు భర్త అనురాగ్‌, మూడేళ్ల కుమార్తె బాల ఆద్య ఉన్నారు. ఇందులో అనురాగ్‌ అమెరికాలో ఉంటుండగా, హావియా తన కుమార్తెతో భర్త స్వస్థలమైన వైజాగ్‌లోని మధురవాడలో ఉంటోంది. ఇటీవల శ్రీకాకుళం వెళ్లిన హావియా తల్లిదండ్రులతో కలిసి మధిరలో ఉండే సోదరుడు డాక్టర్‌ సోమశేఖర్‌ వద్దకు వారం క్రితం వచ్చింది. ఆద్యకు గొంతు సంబంధిత సమస్య ఉండడంతో శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం కారులో వెళ్తున్నారు. కారులో కృష్ణారావు దంపతులు, హావియా, ఆమె కుమార్తె ఆద్య ఉంది. అయితే, పాల్వంచ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన టిప్పర్‌ వాహనం నిలిపి ఉంది. ఆ రహదారిపై వెళ్తున్న వీరి కారుకు కుక్క అడ్డు రావడంతో డ్రైవర్‌ తడికమల్ల కృష్ణ దానిని తప్పించే క్రమంలో ఆగిఉన్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి బెలూన్లు తెరుచుకున్నప్పటికీ అమ్మమ్మ ఒడిలో కూర్చున్న చిన్నారి ఆద్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లి, అమ్మమ్మ, తాతయ్యతోపాటు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఎస్‌ఐ బి.సురేశ్‌ క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement