సీడ్స్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌గా రఘు | - | Sakshi
Sakshi News home page

సీడ్స్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌గా రఘు

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్‌గా బయ్య రఘు నియమితులయ్యారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న రఘును ఉమ్మడి జిల్లాకు బదిలీ చేయగా, ఈ స్థానంలో ఉన్న బిక్షం కరీంనగర్‌ మేనేజర్‌గా బదిలీ అయ్యారు.

డీఎంఓగా సంతోష్‌కుమార్‌

ఖమ్మంవ్యవసాయం: జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి(డీఎంఓ)గా రత్నం సంతోష్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఆయనను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా నియమించడమే కాక డీఎంఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇన్‌చార్జి డీఎంఓగా కొనసాగుతున్న ఎంఏ.అలీం ఆయన అసలు స్థానమైన భద్రాద్రి కొత్తగూడెంకు వెళ్లగా ఆ స్థానంలో సంతోష్‌ బాధ్యతలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఆన్‌డ్యూటీపై విధులు నిర్వర్తిస్తున్న పి.ప్రవీణ్‌కుమార్‌ మిర్చి మార్కెట్‌ పనుల దృష్ట్యా మరో ఆరు నెలలు కొనసాగేలా ఉత్తర్వులు అందాయి.

వైద్య, ఆరోగ్య శాఖలో 76మంది బదిలీ

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 76 మంది ఉద్యోగుల బదిలీ జరిగింది. కేడర్‌ ఆధారంగా కొందరిని ఇతర జిల్లాలకు, మరికొందరిని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించారు. అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ కేడర్‌ మొదలు ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, హెల్త్‌ ఎడ్యుకేటర్లు, ఏఎన్‌ఎమ్‌లు కలిపి 76 మందికి స్థానచలనం కలిగింది. అలాగే, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఐదుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌ను బదిలీ చేయగా, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లోని ఆరుగురు వైద్యులకు ఇతర జిల్లాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక ఇతర కేడర్లలో 10 మందిని జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేశారు.

ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షకు

దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనార్టీ అభ్యర్థులకు ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మహమ్మద్‌ ముజాహిద్‌ తెలిపారు. జనరల్‌, ప్రొఫెషనల్‌ డిగ్రీ చేసిన అభ్యర్థులు హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్‌లో ఈనెల 15లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement