రఘునాథపాలెం: అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయడం ఎంత ముఖ్యమో, భావితరాలకు ఉపయోగపడేలా నాణ్యత పాటించడం కూడా అంతే కీలకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలంలోని వీ.వీ.పాలెంలో రూ.97 లక్షల ‘సుడా’ నిధులతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.30 లక్షలతో నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వీ.వీ.పాలెం గ్రామంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, 1982లో దివంగత ఎన్టీఆర్‌తో కలిసి ఇక్కడకు వచ్చానని గుర్తు చేశారు. అప్పట్లోనే ఎత్తిపోతల పనులు చేపట్టామని తెలిపారు. కాగా, గ్రామస్తులు ఇంటి పరిసరాల్లో మాదిరి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరి చేరవని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ మండల స్థాయికి కేటాయించే పశు వైద్యశాలను వీ.వీ.పాలెంలో నిర్మించడంతో ఈ ప్రాంత ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా, జిల్లాగ్రంథాలయ సంస్థ, ఖమ్మం మార్కెట్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్ బాబా, యరగర్ల హన్మంతరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారి బి.పురంధర్, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు డి.పుల్లయ్య, మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ కాపా ఆదినారాయణ, ఉప సర్పంచ్ గుగులోతు ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


