నేలకొండపల్లి: మండలంలోని అజయ్‌తండాకు చెందిన బానోత్ గోపి(24) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యాన ఆమె వేధింపులు భరించలేక గోపి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత అదృశ్యంపై కేసు
మండలంలోని ఆజయ్‌తండాకు చెందిన ఓ వివాహిత కానరావడం లేదని ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోగా.. ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చికిత్స పొందుతున్న రైతు మృతి
తిరుమలాయపాలెం: వడదెబ్బకు గురైన ఓ రైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని తాళ్లచెరువు గ్రామానికి చెందిన రైతు పులకాని వెంకన్న(57) పది రోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈనేపథ్యాన పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య పద్మ, కుమారులు ఉన్నారు.
అదుపుతప్పి లారీ బోల్తా
బోనకల్: మండలంలోని రాపల్లి స్టేజీ వద్ద సోమవారం అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. పాల్వంచ నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం ఫ్లై యాష్ తీసుకొస్తున్న లారీ బోల్తా పడగా, డ్రైవర్ క్యాబిన్ లోపలే చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు అద్దాలను పగులకొట్టి స్వల్పగాయాలైన డ్రైవర్‌ను బయటకు తీశారు.


