నగర పరిధిలో 26,073 మంది లబ్ధిదారులు
ఇప్పటి వరకు 18,657 మంది
లైవ్ అథంటికేషన్ పూర్తి
త్వరలోనే తేలనున్న అనర్హుల లెక్క
ఖమ్మంమయూరిసెంటర్: అటు కొత్త ఆశలు.. ఇటు అర్హత పరీక్షలు! ఇదీ ఖమ్మం నగరపాలక సంస్థ పింఛన్ల విభాగంలో కనిపిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అర్హుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో దరఖాస్తులు ఇచ్చే వారితో పాటు ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చి విచారణ పూర్తయిన వారు కేఎంసీకి బారులు దీరుతున్నారు. ఇదే సమయాన అనర్హులను తొలగించేందుకు జీవన్ అపమాణ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫించన్ పొందుతున్న వారు తాము జీవించి ఉన్నామని తెలిపేందుకు జీవన్ ప్రమాణ్‌లో భాగంగా ఫొటో దిగుతున్నారు.
మేం బతికే ఉన్నాం...
ప్రస్తుతం ఆసరా పింఛన్లు పొందుతున్న వారు అర్హులా, కాదా అన్నది తేల్చేందుకు ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ (లైవ్ సర్టిఫికేట్) ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు లబ్ధిదారులు ఫొటో దిగాల్సి ఉంటుంది. ఈ ఫొటోను వారి ఆధార్ డేటాతో సరిపోల్చి జీవించి ఉన్నట్లు ధ్రువీకరిస్తారు. అంధులు, చేతులు లేని వారు, ఇతర దివ్యాంగుల కోసం ఐరిస్ (కంటిపాప) గుర్తింపు వంటి పద్ధతులను వాడుతున్నారు. ఈమేరకు లబ్ధిదారులు కేఎంసీ కార్యాలయానికి క్యూ కడుతుండగా.. కార్యాలయానికి రాలేనివారి ఇళ్లకు సిబ్బందే వెళ్తున్నారు.
సాగుతున్న ప్రక్రియ..
పది రోజులుగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయోమెట్రిక్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. కేఎంసీకి వచ్చే వారి కోసం కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఇక మెప్మా ఆర్పీలు, వార్డు అధికారుల ఆధ్వర్యాన డివిజన్ల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నారు. కేఎంసీ పరిధిలో మొత్తం 26,073 మంది పింఛన్‌దారులు ఉండగా.. ఇప్పటివరకు 18,657 మంది జీవన్ ప్రమాణ్ పూర్తి చేసుకున్నారు. ఈనెల 15వ తేదీ వరకే గడువు ఇవ్వడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. వారం రోజుల్లో మిగిలిన 7,416 మంది జీవించి ఉన్నట్లు అధికారులు గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పింఛన్ తీసుకుంటున్న వారిలో అనర్హులు ఎందరు ఉన్నారనేది తేలుతుంది.
కేఎంసీలో ముమ్మరంగా జీవన్ ప్రమాణ్


