‘ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్ల తొలగింపునకు కుట్ర’ | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటర్ల తొలగింపునకు కుట్ర’

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

ఖమ్మం మామిళ్లగూడెం: ఎస్‌ఐఆర్‌ పేరుతో మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్ల తొలగించే ప్రయత్నం జరుగుతున్నందున రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు కాపాడుకోవడంపై ప్రజలు దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌ సూచించారు. ఖమ్మం సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి అధ్యక్షతన సోమవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధ్రువీకరణ పత్రాల లేమి కారణంగా పేద ప్రజలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానానికి బదులుగా ప్రభుత్వమే ఓటర్లను ఎంపిక చేసేలా కుట్ర పన్నిన బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం రైతు డిస్కంను తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతులు, పేదలకు అందుతున్న విద్యుత్‌ సబ్సిడీలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్‌, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, ఎం.గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement