ప్రభుత్వ భూముల్లో
సోలార్ ప్లాంట్లు
విద్యుత్ రంగం బలోపేతానికి చర్యలు
పాకబండలో సబ్‌స్టేషన్‌ను
ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి
హాజరైన మంత్రి తుమ్మల,
కలెక్టర్ దివాకర
ఖమ్మం అర్బన్: నానాటికీ పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తూ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. డిమాండ్ గణనీయంగా పెరిగినా వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం పాకబండ వద్ద నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2023లో నమోదైన 15 వేల మెగావాట్ల గరిష్ట డిమాండ్ ప్రస్తుతం 18,548 మెగావాట్లకు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో విద్యుత్ అవసరాలు మరింత పెరుగుతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2030 నాటికి 20వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 85 గ్రామాల్లో ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ప్యానళ్లు అమరుస్తున్నామని తెలిపారు. కాగా, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో అవసరాల దృష్ట్యా ఉంచుకొని మరిన్ని సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్ల ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించారు. అంతేకాక ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ ఖమ్మంలో రానున్న 30 ఏళ్ల అవసరాలను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తుండగా, మరో ఐదు సబ్‌స్టేషన్లకు భూకేటాయింపు వారంలో పూర్తి చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగులు, సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహమ్మద్ ఖాదర్ బాబా, ఎస్‌ఈ శ్రీనివాసచారి, మాజీ మేయర్ పి.నీరజ తదితరులు పాల్గొన్నారు.


