ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) మ్యాపింగ్‌లో భాగంగా సవరణలను ఇంటింటి పరిశీలన ద్వారా బీఎల్‌ఓలు ఈనెల 10వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. రఘునాథపాలెం మండలం కోటపాడు, ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో 2002 నాటి జాబితాలోని ఓటర్లు, వారి వారసులు, కుటుంబీకులను ప్రస్తుత ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తూ, ఎక్కడైనా తేడాలు వస్తే క్షేత్రస్థాయి పరిశీలన సవరించాలని సూచించారు. ఈ విషయమై ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. అంతేకాక ప్రక్రియను సూపర్‌వైజర్లు, అధికారులు పర్యవేక్షిస్తూ డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను ధ్రవీకరించుకున్నాకే తొలగించాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ తహసీల్దార్లు శ్వేత, జయచందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


