జలపుష్పాల జాతర | - | Sakshi
Sakshi News home page

జలపుష్పాల జాతర

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

ఒకరోజు ముందే చేపలకు

పెరిగిన డిమాండ్‌

150 టన్నులకు పైగా

విక్రయాల అంచనా

ఖమ్మంవ్యవసాయం: మృగశిర కార్తె సోమవారం మొదలుకానుంది. రోహిణి కార్తె తర్వాత వచ్చే ఈ కార్తెలో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ కార్తె మొదటి రోజున పలు వర్గాల వారు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే, ఇదేరోజు ఉబ్బసం, ఆయాసంతో బాధపడే వారికి హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేపమందు ఇస్తుంటారు. వేసవిలో ఉష్ణోగ్రతతో శరీరంలో వేడి పెరుగుతుందని.. అది చేపలు తినటం ద్వారా దూరమవుతుందని నమ్ముతారు. తద్వారా ఏటా మృగశిర ఆరంభం రోజున చేపల అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే, మృగశిర కార్తె సోమవారం మొదలుకానుండగా, జిల్లా అంతటా ఆదివారమే చేపల అమ్మకాలు జోరందుకున్నాయి.

ఆంధ్రా నుంచి దిగుమతి

మృగశిర కార్తెను పురస్కరించుకుని జిల్లాలో సోమవారం ఒకేరోజు దాదాపు 150 టన్నుల నుంచి 200 టన్నుల వరకు చేపలు అమ్ముడవుతాయని అంచనా. ఈ మేరకు మత్స్యకారులు జిల్లా చెరువుల్లో వేట మొదలుపెట్టారు. అంతేకాక సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలు దిగుమతి చేసుకున్నారు. ఏలూరు, కై కలూరు, బాపట్ల, విజయవాడ, రాజమండ్రితో పాటు పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న చేపలను ఆక్సిజన్‌ సిలిండర్ల ఆధారంగా నిల్వ చేశారు.

రకాల ఆధారంగా డిమాండ్‌

జిల్లాలో ఆదివారమే చేపల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. సహజంగా మృగశిర కార్తె రోజున చేపలకు డిమాండ్‌ ఉండడంతో రకాల ఆధారంగా ధరలు నిర్ణయించారు. సహజంగా మన ప్రాంతంలో అధిక ధర ఉండే కొర్రమేను చేప ధర మరింత పెరిగింది. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలో రూ.350 ఉంటుంది. కానీ అది ఇప్పుడు రూ.500 వరకు చేరింది. ఇక బొచ్చలు, రవ్వలు, గ్యాస్‌కట్‌లు, బంగారు తీగలు వంటి తెల్లచేపల ధర మామూలుగా కిలో రూ.180 నుంచి రూ.200 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.220, అంతకు మించి ధరతో విక్రయిస్తున్నారు. అలాగే, రూ.350 కేజీ లభించే పచ్చి రొయ్యల ధర రూ.450 వరకు పెంచారు.

నేడు మృగశిర కార్తె

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement