ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరను రూ.29 పెంచడంతో సామాన్యులపై మోయలేని భారం పడిందని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి పేర్కొన్నారు. ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం అన్ని ధరలను ఎడాపెడా పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. ఓ వైపు ధరలు పెంచుతూ, మరోవైపు ప్రజలు పొదుపు పాటించాలని సూచించడం కేంద్రం ద్వంద్వ వైఖరి, నీతికి నిదర్శనమన్నారు. కార్పొరేట్ శక్తులకు వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. సామాన్యులపై మాత్రం పన్నుల భారం మోపుతోందని తెలిపారు. ఈ మేరకు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాపనేని శోభ, నాయకులు టి.ఝాన్సీ, గోకినపల్లి సరోజిని, బందెల లలిత, స్వాతి, ప్రమీల, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.
గోదాం నిర్మాణాన్ని అడ్డుకున్న ఆదివాసీలు
● విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని
ఆందోళన
కారేపల్లి: మండలంలోని గంగాదేవి గుట్టపై గోదాం నిర్మాణ పనులను గుట్టకింద గుంపు గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ఇక్కడ గోదాం నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ శంకుస్థాపన చేశారు. అయితే, గోదాం నిర్మాణం పేరుతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన గంగాదేవి గుట్టను ధ్వంసం చేయడం సరికాదని ఆదివాసీలు చెబుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన గంగాదేవి గుట్ట, కాళికాదేవి, సమ్మక్క విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాక గుట్ట మట్టిని తరలించి కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ.. గోదాం నిర్మాణం పేరుతో గుట్టను గుల్ల చేస్తున్నారని, తద్వారా ఆరాధ్య దైవాల విగ్రహాలు విధ్వంసమవుతున్నాయని తెలిపారు. ఇకనైనా గోదాం నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. కాగా, ఆదివాసీల ఆందోళన విషయం తెలిసి ఎస్‌ఐ గోపి, సిబ్బందితో చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అనడంతో వెనుదిరిగారు.


