జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య
ఖమ్మంవ్యవసాయం: ఈ సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఈ విషయమై వ్యవసాయ, జల వనరులు, ఉద్యానవన, భూగర్భ జల వనరుల శాఖల ఆధ్వర్యాన గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డీఏఓ విడుదల చేసిన ప్రకటనలోని సూచనలు ఇలా ఉన్నాయి.
వర్షాలు ఆలస్యమైతే వరి సాగు చేసే రైతులు నాటు విధానానికి బదులుగా వెదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచించారు. స్వల్పకాలిక వరి రకాలైన బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, డబ్ల్యూజీఎల్–44, జేజీఎల్–1978, ఎంటీయూ–1010, జైశ్రీరామ్, హెచ్‌ఎంటీ సోనా వంటి రకాలు ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.
వర్షాభావ పరిస్థితులతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిన పక్షంలో వాటి స్థానాన పెసర, మినుము, బొబ్బర, కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏఓ పేర్కొన్నారు. రైతులకు అవసరమైన పెసర విత్తనాలను ఆత్మనిర్భరత మిషన్ పథకం కింద రాయితీపై అందజేస్తామని తెలిపారు.
పత్తి సాగు చేసే రైతులు తొందరపడి విత్తనాలు నాటొద్దని, భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేయాలని సూచించారు. కనీసం 60 – 70 మి.మీ. వర్షపాతం నమోదయ్యాకే పత్తి విత్తనాలు నాటాలని తెలిపారు. జూలై 15 వరకు పత్తి సాగుకు అనుకూల సమయం ఉంటుందని డీఏఓ వివరించారు.


