హంగులు.. రంగులు! | - | Sakshi
Sakshi News home page

హంగులు.. రంగులు!

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

మన ఊరు – మన బడి,

ఏఏపీ పథకాలతో అభివృద్ధి

కొత్త అందం సంతరించుకుంటున్న సర్కారీ స్కూళ్లు

కొత్తరూపు

తరగతి గదిలో పిల్లల

బొమ్మలు

భవిత కేంద్రంలో

ప్రత్యేకంగా రాయించిన

సంజ్ఞలు, అక్షరాలు

ఖమ్మం సహకారనగర్‌: కొత్త విద్యాసంవత్సరం సమీపిస్తోంది. ఈ నేపథ్యాన ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులను ఆకట్టుకునేలా భవనాలను సిద్ధం చేసుకున్నారు. అవసరమైన భవనాలకు రంగులు వేయించడమే కాక ఆవరణలోని మహనీయులు, ఇతర బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. వివిధ పథకాల ద్వారా వచ్చిన నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండగా చివరి దశకు చేరాయి. తద్వారా ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా సిద్ధమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సరి‘కొత్త’గా స్వాగతం పలకనున్నాయి.

మౌలిక వసతులు

ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాక అవసరమైన పనులకు నిధులు సమకూరుస్తోంది. దీంతో పాఠశాలలు కొత్త హంగులు అద్దుకుని విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. అంతేకాక తాగునీరు, బాత్‌రూంలు, నీటి సౌకర్యం తదితర అవసరమైన మౌలిక సదుపాయాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. గత కొన్నేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతుండగా, ఈసారి మరింతగా రంగులు అద్దుకున్నాయి. ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకానికి తోడు విద్యార్థులకు అల్పాహారం కూడా సమకూర్చనుండడంతో ప్రవేశాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

‘మన ఊరు – మన బడి’తో..

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాల ద్వారా కూడా పనులు చేపట్టారు. ఈ పథకంలో భాగంగా 426 పాఠశాలల్లో రూ.61,88,17,284 అంచనా వ్యయంతో పనులు చేయించగా, 195 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.32,79,79,939 కోట్ల బిల్లులు సిద్ధం కాగా, రూ.23,71,26,903 చెల్లించారు.

ముస్తాబవుతున్న

ప్రభుత్వ పాఠశాలలు

అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా పర్యవేక్షణ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు కోసం 954 పాఠశాలలకు రూ.35.5 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 952 పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరో రెండు చోట్ల చివరి దశలో ఉన్నాయి. కాగా, పూర్తయిన పనులకు సంబంధించి రూ.24,49,51,922 బిల్లులు కూడా చెల్లించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement