ముదిగొండ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ముదిగొండ మండలంఓ పర్యటించనున్నారు. ఉదయం మధ్యాహ్నం 12గంటలకు ఆయన యడవల్లి లక్ష్మీపురంలో గ్రామపంచాయతీ భవనం ప్రారంభించడంతో పాటు యడవల్లిలో సబ్‌స్టేషన్, ముదిగొండలో ఈఆర్‌ఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, యడవల్లి – తల్లంపాడు రహదారి అభివృద్ధి పనులు, యడవల్లి నుంచి లక్ష్మీపురం మీదుగా తెల్దార్‌పల్లి వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత మధ్యాహ్నం 3గంటలకు బోనకల్ మండలంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాల నిర్మాణ పనులను భట్టి పరిశీలిస్తారు.
పంట అవశేషాలు కాలిస్తే రూ.25 వేల జరిమానా
ఏన్కూరు: రైతులు పొలాల్లో మిగిలిన అవశేషాలను కాలిస్తే రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేసిన ఆయన రికార్డుల నిర్వహణ, బిల్లులపై యజమానులకు సూచనలు చేశారు. రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆతర్వాత తూతలింగన్నపేట గ్రామసభలో డీఏఓ మాట్లాడుతూ రైతులు మొక్కజొన్న, వరి కోశాక అవశేషాలను కాల్చడం వల్ల నష్టాలు ఎదురవుతున్నందున, భూమిలో కలియదున్నాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నందున ప్రత్యామ్నాయంగా కంది పెసర, మినుములు, జొన్నలు వంటివి సాగుచేయాలన్నారు. అంతేకాక తొలకరి వర్షాలతో తొందరపడకుండా భూమి పదును వచ్చాకే విత్తనాలు నాటాలని సూచించారు. ఎంపీడీఓ పల్లి భాగ్యశ్రీ, ఏఓ నర్సింహరావు, ఏఈఓలు అశోక్, సైదులు పాల్గొన్నారు.
రేపటి ప్రజావాణి రద్దు
ఖమ్మం సహకారనగర్: ప్రజా సమస్యలపై దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి (గీవెన్స్ డే) ఈనెల 8వ తేదీన రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామసభల్లో పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
శృంగేరి పీఠాధిపతికి ఆహ్వానం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుమలగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మహా కుంభాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆమె వెంట శాఖ కమిషనర్ కె.హనుమంతరావు, సలహాదారుడు గోవిందా హరి, ఈఓ కె.జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేదపండితులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రత్యేకతలు, మహా కుంభాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్లను స్వామీజీకి వివరించారు.
జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి వారి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకంతో పాటు స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులతో పాటు ఆలయ ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


