వాడుకున్నారు.. వదిలేశారు ! | - | Sakshi
Sakshi News home page

వాడుకున్నారు.. వదిలేశారు !

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

● ఫుడ్‌పార్క్‌లో కంపెనీ విద్యుత్‌ బకాయి రూ.1.03 కోట్లు ● ఫలితంగా ఈ సీజన్‌లో కార్యకలాపాలకు బ్రేక్‌ కంపెనీకి నోటీసు ఇచ్చాం.. బకాయిలు వారే చెల్లిస్తారు..

● ఫుడ్‌పార్క్‌లో కంపెనీ విద్యుత్‌ బకాయి రూ.1.03 కోట్లు ● ఫలితంగా ఈ సీజన్‌లో కార్యకలాపాలకు బ్రేక్‌

ఎల్లో అండ్‌ గ్రీన్స్‌ కంపెనీ మీటర్‌పై రూ.1,03,23,768 బిల్లు బకాయి ఉండడంతో నోటీసు ఇచ్చాం. చట్టప్రకారం వసూలు చేస్తాం. – ఎల్‌.రాములు, డీఈఈ, సత్తుపల్లి

ఎల్లో అండ్‌ గ్రీన్స్‌ పేరిట ఉన్న విద్యుత్‌ బకాయి కంపెనీ బాధ్యులే చెల్లిస్తారు. ఈ సమస్య ఇతర కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపబోదు. – స్వామి, ఇన్‌చార్జ్‌ జోనల్‌ మేనేజర్‌

సత్తుపల్లి: ఓ పరిశ్రమ వస్తుందని ఆనందిస్తుండగానే, ఇంకో పరిశ్రమ మూతపడుతోంది. ఫలితంగా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని టీఎస్‌ఐఐసీ ఫుడ్‌పార్కులో ఎప్పటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో పండ్ల తోటలు విస్తారంగా ఉన్నందున 2008 జనవరి 27న అప్పటి సీఎం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సహకారంతో నాటి ఎమ్మెల్యే జలగం వెంకటరావు స్థానిక రైతులను ఒప్పించి 203 ఎకరాల భూమి సేకరించి మెగా ఫుడ్‌పార్క్‌కు అంకురార్పణ చేశారు. ఆపై 2016 నవంబర్‌ 16న నాటి మంత్రులు కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు రూ.109 కోట్లతో పూర్తయిన పరిపాలన భవనం, గోదాంలు, సబ్‌స్టేషన్‌ ప్రారంభించారు.

కొన్ని రెడీ.. ఇంకొన్ని పెండింగ్‌

బుగ్గపాడు ఫుడ్‌పార్కులో పరిశ్రమలు పెట్టేలా యజమానులను ఆకర్షించేలా రెండు, మూడు సార్లు ప్రభుత్వం మేళాలు నిర్వహించింది. అందులో భాగంగా కోల్డ్‌ స్టోరేజ్‌ను హైదరాబాద్‌కు చెందిన ఎల్లో అండ్‌ గ్రీన్స్‌ అగ్రిఫ్రెష్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బాధ్యులు మామిడి జ్యూస్‌ తయారీ, నిల్వల కోసం తీసుకున్నారు. ఇక స్టాడెంట్‌ ఫ్యాక్టరీ షెడ్‌ను విజయవాడ కేంద్రంగా పనిచేసే ట్రాన్స్‌సెండ్‌ ఫుడ్‌వర్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ జీడిగింజలు ప్రాసెస్‌, మామిడి, జామ పండ్లతో పల్ప్‌ తయారీకి కోసం తీసుకుంది. అంతేకాక యాంకరింగ్‌ ప్రాజెక్టు కింద బెంగళూరుకు చెందిన ఫ్రూషన్‌ ఇండియా, బయోగ్రీన్‌ ఇండియా కంపెనీలకు భూకేటాయింపులు జరిగినా ఫ్రూషన్‌ ఇండియా కంపెనీ పిల్లర్ల దశలో నిలిపివేసింది. బయోగ్రీన్‌ ఇండియా అసలు పనులే చేపట్టలేదు.

రూ.కోటి దాటిన బకాయి

ఐదేళ్ల క్రితం ఎల్లో అండ్‌ గ్రీన్‌ అగ్రిఫ్రెష్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ బుగ్గపాడు ఫుడ్‌పార్కులో కోల్డ్‌ స్టోరేజీని లీజ్‌కు తీసుకుంది. ఏటా మూడు నెలల మామిడి సీజన్‌లో ఇక్కడ మామిడితో జ్యూస్‌ తీసి కోల్డ్‌స్టోరేజ్‌లో భద్రపరిచి ఎగుమతి చేసేలా ఒప్పందం కుదిరింది. దీనికి విద్యుత్‌ సరఫరా కోసం 700 కిలోవాట్ల హెచ్‌టీ లైన్‌ సర్వీస్‌ను విద్యుత్‌శాఖ సమకూర్చింది. సరాసరి నెలకు వాడినా, వాడకున్నా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది వరకే రూ.50 లక్షల బిల్లు బకాయి ఉండడంతో ఉన్నతాధికారులతో చర్చించి విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పి దఫాలుగా రూ.20 లక్షలు చెల్లించి గత సీజన్‌లో పనిచేయించారు. ఈ ఏడాది మళ్లీ వస్తే రూ.1.03 కోట్ల బకాయి చెల్లించాలని ఉందని చెప్పడంతో పనులు చేపట్టలేదు. అయితే, బకాయి రూ.కోటి దాటే వరకు విద్యుత్‌శాఖ అధికా రులు ఎందుకు పట్టించుకోలేదనే అంశంపై సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, ఖాయిలా పరిశ్రమ కింద చూపించి బకా యిల మాఫీకి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement