మరువలేని జ్ఞాపకాలను
మిగిల్చే హాలీడేస్
ఊరి ప్రయాణంలో
హాయిగొలిపే అనుభూతులు
అమ్మమ్మ, తాతయ్యల ఆప్యాయతకు
తీపిగుర్తులు
భారంగానే తిరుగుముఖం
ఇల్లెందురూరల్: ఆ రోజుల్లో వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. మనసు గాలిలో తేలిపోయేది. అప్పటివరకు ఉన్న క్రమశిక్షణ అంతా ఆనందపు కేకలుగా మారిపోయేది. ఇలా నాటి సెలవుల్లో బాలలు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఎంత హుషారుగా సిద్ధమయ్యేవారో.. అంతే ఆనందాన్ని సెలవుల్లో అందిపుచ్చుకొని తిరుగుముఖం పట్టేవారు. పల్లె వాకిళ్లలోకి చేరి ఎలాంటి ఆనందం.. అనుభూతి, ఆప్యాయతలను అందిపుచ్చుకునేవారో ఆ రోజుల్లోకి వెళ్లి ఓసారి చూసొద్దాం.
ఊరికి వెళ్లే ఎర్రబస్సు ఎక్కగానే ప్రాణం లేచివచ్చేది. కిటికీ పక్కన సీటుకోసం అన్నాచెల్లెళ్ల మధ్యజరిగే ఆ చిన్న గొడవలే తీయని జ్ఞాపకాలుగా మిగిలేవి. బస్సు కిటికీలో నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి.. వెనక్కి పరిగెడుతున్న పచ్చని పొలాలు.. ప్రతీది అమ్మమ్మ ఊరి వైపు మరింత వేగంగా లాగేస్తున్నట్లు అనిపించేది. ఊరు రాగానే బస్టాండ్‌లో ఎదురు చూస్తున్న తాతయ్య ముఖంలో కనిపించే ఆనందం ముందు ప్రపంచంలో మరేదీ సాటిరాదు. అప్పట్లో కార్లు ఎక్కడివి? తాతయ్య ఎడ్ల బండిపై మట్టిరోడ్ల మీద వెళ్తుంటే ఆ మట్టి వాసనలు.. ఆ గళగళ శబ్దాలు మనసుకు హత్తుకునేవి. ఇంటి గుమ్మం తొక్కగానే అమ్మమ్మ ఇచ్చేహారతితో పల్లెటూరి ప్రేమకు స్వాగతం పలికినట్లు ఉండేది.
ఉదయాన్నే పెరట్లో రాగి గంగాళంలో కాగిన వేడి నీళ్లతో అమ్మమ్మ చేయించే తలంటు స్నానం, కుంకుడు కాయల గుమగుమలు ఇప్పటికీ గుర్తే కదూ. అందరూ కలిసి కింద కూర్చుని విస్తరాకుల్లో వడ్డించుకొని తింటుంటే ఆ అన్నంలో అమ్మమ్మ కలిపిన ప్రేమ కూడా తోడై అమృతంలా అనిపించేది. మధ్యాహ్నం వేళ పెద్దల కళ్లు కప్పి మామిడితోటల్లోకి దూరి రాళ్లతో కొట్టి కాయలు రాల్చడం పెద్ద సాహసమే. ఆ కాయల ముక్కలకు కారం అద్దుకొని తింటుంటే పులుపుకు కళ్లు మూసుకుపోయినా తిన డం మాత్రం ఆపేవాళ్లు కాదు. మిద్దె మీద అమ్మ, అమ్మమ్మ ఒడియాలు పెడుతుంటే మధ్యమధ్యలో పచ్చి పిండిని దొంగతనంగా తినడం అందరికీ అలవాటే. అమ్మమ్మ చేతులతో కలుపుతున్న కొత్త ఆవకాయ రుచి చూడడానికి మనసంతా ఆరాటపడేది. మండే ఎండల్లో ఊరి చెరువు పక్కన గంటల తరబడి ఈతలు కొట్టడం.. కళ్లు ఎర్రబడే దాకా నీళ్లలో ఆడుకోవడం మజాగా ఉండేది. సూర్యుడు పడమట కొండల్లోకి వెళ్లే వేళ మర్రి చెట్టుకు కట్టిన ఊడలకు కట్టిన ఊయల ఊగుతుంటే ఆ గాలికి మనసు కూడా ఊయలలూగేది. రాత్రిపూట ఎగురుతున్న మినుగురు పురుగులను పట్టుకొని అగ్గిపెట్టెలో దాచుకొని మురిసిపోవడం ఆ నాటి అమాయకత్వానికి గుర్తు. జేబుల నిండా గోలీలు వేసుకొని ఊరి స్నేహితులతో కలిసి మట్టిలో ఆడుకున్న ఆ ఆటల ముందు ఇప్పటి వీడియో గేమ్‌లు ఏపాటివి?!
ఇలా ఆనందంగా గడిపే సరికి సెలవులు ఇట్టే అయిపోయినట్లు అనిపించేవి. తిరుగు ప్రయాణానికి మళ్లీ ఇనుప పెట్టెలో బట్టలు సర్దే ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి ఆ పెట్టెలో బట్టల కన్నా అమ్మమ్మ చేసిన ఆవకాయలు, వడియాలే ఎక్కువగా ఉండేవి. ఇక ఊరు విడిచిపెట్టి వెళ్లే రోజు రానే వచ్చింది. మళ్లీ ఎప్పుడు వస్తారోనని కళ్లలో నీళ్లు పెట్టుకునే తాతయ్య, అమ్మమ్మను వదిలి రావడం మనసుకు చాలా భారంగా ఉండేది. ఎర్ర బస్సులో ప్రయాణం చేస్తుంటే ఆ సమయంలో వెనక్కు వెళ్తున్న ఊరు, పచ్చని పొలాలను చూస్తూ బరువెక్కిన హృదయంతో ఊరికి వీడ్కోలు పలికేవాళ్లం. మళ్లీ కాంక్రీట్ అడవిలోకి వచ్చేసినా.. మనసంతా ఆ పల్లెటూరి జ్ఞాపకాల్లోనే చాన్నాళ్లు విహరించేది. కాలం ఎంత మారినా ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఆనాటి వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివి.. అమూల్యమైనవి.


