ఖమ్మంవ్యవసాయం/కల్లూరు రూరల్: రంగారెడ్డి జిల్లా కోహెడలో సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి జిల్లా నుంచి రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రతినిధులు వెళ్లారు. ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావుతో పాటు మధిర, కల్లూరు తదితర మార్కెట్ల ప్రతినిధులు వెళ్లగా, వీరి బస్సులను జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి(డీఎంఓ) అలీం ప్రారంభించారు. కాగా, కల్లూరు నుంచి వెళ్తున్న మార్కెట్ పాలకవర్గం, ఉద్యోగులు, రైతుల వాహనాలను మార్కెట్ చైర్మన్ బాగం నీరజాదేవి ప్రారంభించారు.
ప్రీమియర్ లీగ్ నెట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి ప్రీమియర్ లీగ్ నెట్‌బాల్ పోటీలు శనివారం ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభమయ్యాయి. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రెహనాబేగం, డాక్టర్ కోటేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు శారీరక దృఢత్వాన్నే కాక క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. హార్వెస్ట్ ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి మాట్లాడుతూ.. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తే క్రీడాకారులకు విజయాలు సొంతమవుతాయని తెలిపారు. నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ దీప్తి, ఎన్.ఫణికుమార్‌తో పాటు పీవీ రమణ, నాగయ్య పాల్గొన్నారు. కాగా, తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు నిర్వహించి విజేతలను ప్రకటించారు.
తపాలా ఉద్యోగులకు అవార్డులు
ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి జిల్లాలో 2025–26 సంవత్సరానికి ప్రతిభ కనబరిచిన తపాలా శాఖ ఉద్యోగులకు అవార్డులు ప్రకటించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులకు పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి అవార్డులు అందజేసి మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం తపాలా జీవిత బీమా విభాగంలో రూ.31.27 కోట్లు, గ్రామీణ తపాలా జీవిత బీమా విభాగంలో రూ.27 కోట్లు సేకరించామని తెలిపారు. ఈ ఏడాది కూడా లక్ష్యాలను అధిగమించి తెలంగాణ సర్కిల్‌లోనే ఖమ్మం డివిజన్‌ను అగ్రగామిగా నిలపాలన్నారు. ఐపీపీబీ (ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) మేనేజర్ రాజేశ్ మాట్లాడుతూ.. ఖమ్మం తపాలా డివిజన్‌లో 41,500 ఖాతాలు తెరవగా, గ్రూప్ యాక్సిడెంట్ పాలసీల విభాగంలో రూ.1.50 కోట్లు వసూలయ్యాయని తెలిపారు. అంతేకాక రూ. 6 కోట్ల క్లెయిమ్‌లు చెల్లించినట్లు వెల్లడించారు. అనంతరం ఏఎస్‌పీ మల్లికార్జున్ మాట్లాడగా పలు విభాగాల్లో 200 మందికి అవార్డులు అందజేశారు. పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ పోస్టు మాస్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


