ఐటీఐ ప్రిన్సిపాల్‌గా సక్రు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐ ప్రిన్సిపాల్‌గా సక్రు

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌గా సక్రు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఏ.శ్రీనివాసరావు మధిర ఐటీఐకి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో హన్మకొండ ప్రిన్సిపాల్‌ సక్రును నియమించగా ఆయన విధుల్లో చేరారు.

ఫర్టిలైజర్‌ షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సాగు సీజన్‌ సమీపించడంలో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు మొదలుపెట్టాయి. ఈమేరకు ఖమ్మంలోని పలు విత్తన దుకాణాలు, గోదాముల్లో పోలీసు, వ్యవసాయ శాఖలకు చెందిన టాస్క్‌ఫోర్క్‌ అధికారుల బృందం శుక్రవారం తనిఖీ చేసింది. పత్తిలో ప్రభుత్వం బీటీ–2 పత్తి విత్తనాలకు అనుమతి ఇవ్వగా కొందరు హెచ్‌టీ కాటన్‌(బీటీ–3) విత్తనాలను అమ్ముతున్నారనే ఫిర్యాదులతో నిశితంగా పరిశీలించారు. అంతేకాక విత్తన దుకాణాల లైసెన్సులు, స్టాక్‌ను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. బృందంలో ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు, ఖమ్మం అర్బన్‌ ఏఓ బలుసు కిషోర్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ వి.ఉదయ్‌కుమార్‌, ఎస్‌ఐ సి.రవి పాల్గొన్నారు.

చిన్నారి ఆరోగ్యంపై ఎమ్మెల్యే ఆరా

వైరారూరల్‌: ఖమ్మం జనరల్‌ ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వైరా మండలంలోని పుణ్యపురానికి చెందిన రేణుక నెలల కుమారుడు మోహన్‌ రుద్రాక్ష చేయి తొలగించిన విషయం విదితమే. ఈమేరకు కొత్తగూడెం గొల్లగూడెంలో ఉంటున్న రేణుకను శుక్రవారం ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌ పరామర్శించి చిన్నారి చికిత్స ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు కారకులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవా లని కోరారు. అలాగే, చిన్నారి వైద్యఖర్చులు భరించడంతో పాటు కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని తెలిపారు. వైరా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కట్ల సంతోష్‌, నాయకులు వెంగళ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జామాయిల్‌ తోట దగ్ధం

కారేపల్లి: మండలంలోని బొక్కలతండా స్టేజీ సమీపాన రైతు వాకుండోత్‌ గన్యాకు చెందిన జామాయిల్‌ తోటకు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. గ్రామంలో శుక్రవారం సాయంత్రం గాలిదుమారానికి విద్యుత్‌ వైర్లు రాసుకుని షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడడంతో నిప్పు రవ్వలు తోటపై పడి మంటలు మొదలయ్యాయి. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేలోగానే తోట కాలిపోయింది. ఘటనలో రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినందున ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గన్యా కోరాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement