డీసీసీబీలో వివాదాస్పదంగా క్లస్టర్ల వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

డీసీసీబీలో వివాదాస్పదంగా క్లస్టర్ల వ్యవస్థ

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) ప్రవేశపెట్టిన క్లస్టర్ల సూపర్‌వైజర్ల వ్యవస్థ వివాదాస్పదంగా మారింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రతీ నాలుగు నుంచి ఐదు పీఏసీఎస్‌ల లావాదేవీలు, రుణ స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఒక క్లస్టర్‌ సూపర్‌వైజర్‌(స్టాఫ్‌ అసిస్టెంట్‌)ను సీఈఓ ఎన్‌.వెంకట్‌ ఆదిత్య నియమించారు. ఇప్పటికే ప్రతీ బ్యాంకు బ్రాంచిలో ఒక స్టాఫ్‌ అసిస్టెంట్‌ ఆ పరిధిలోని లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ కొత్తగా క్లస్టర్‌ సూపర్‌వైజర్ల వ్యవస్థను తీసుకురావడాన్ని ఉద్యోగ సంఘాలు, తెలంగాణ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(టీసీసీబీఈఏ) వ్యతిరేకిస్తోంది. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సీఈఓను కోరినా ఫలితం లేక రెండు రోజులుగా డీసీసీబీ ప్రధాన కార్యాలయం, బ్రాంచ్‌ల ఎదుటభోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. సర్వీస్‌ నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన క్లస్టర్ల వ్యవస్థను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. టీసీసీబీఈఏ జిల్లా కార్యదర్శి ఎం.రామకృష్ణ, డీసీబీఈయూ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో నిందితుడికి

20 ఏళ్ల జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌/రఘునాథపాలెం: మాయమాటలతో బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. ఖమ్మం జిల్లా పోక్స్‌–1 కోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయాధికారి, మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి బాకరాజు శ్రీనివాసరావు శుక్రవారం వెలువరించిన ఈ తీర్పు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గణేశ్వరం గ్రామానికి చెందిన మాలోత్‌ హుస్సేన్‌ ఓ బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు 2024 ఏప్రిల్‌ 25న ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది. ఈమేరకు సాక్ష్యాలు, వైద్య నివేదికల ఆధారంగా చార్జిషీట్‌ దాఖలు చేయడంతో విచారణ అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువు కాగా జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించిన ఏపీపీ శరత్‌కుమార్‌రెడ్డి, విచారణ చేపట్టిన నాటి, ప్రస్తుత సీఐలు శ్రీహరి, ఉస్మాన్‌ షరీఫ్‌, భరోసా లీగల్‌ ఆఫీసర్‌ ఎం.ఉమారాణి, సిబ్బంది సాంబశివరావు, శ్రీకాంత్‌, చిట్టిబాబును పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement