బోనకల్: మారుతున్న పరిస్థితుల నేపథ్యాన సమాజానికి కమ్యూనిస్టులే రక్ష అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మండలంలోని జనరల్ బ్రాహ్మణపల్లిలో ఏలూరి రమేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా కార్పొరేట్ అనుకూల పాలన సాగిస్తుండడమే కాక కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టులపైనే ఎక్కువ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హామీలను పక్కనపెట్టి వ్యవసాయం, పారిశ్రామిక రంగాలపై వివక్ష కనబరుస్తున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలనే వారికి సీపీఐ తగిన సమాధానం చెబుతుందని కూనంనేని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూనే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలానికి అనుగుణంగా శ్రేణులు పోటీ చేయాలని సూచించారు. తొలుత సీపీఐ పతాకాన్ని తెలంగాణ సాయుధ పోరాట యోదుడు పారుపల్లి రాఘవయ్య ఆవిష్కరించారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ జిల్లా, మండల కార్యదర్శులు దండి సురేష్, యంగల ఆనంద్‌రావు, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఏనుగు గాంధీ, తూము రోషన్‌కుమార్, జక్కుల రామారావు, పారుపల్లి నరసింహారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని


