అంచనాలతోనే సరి.. | - | Sakshi
Sakshi News home page

అంచనాలతోనే సరి..

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

నిధుల విడుదలలో మాత్రం జాప్యం

కాగితాలకే పరిమితమైన

హాస్టళ్ల మరమ్మతు ప్రతిపాదనలు

మరోసారి సర్వే చేస్తున్న అధికారులు

ఖమ్మంమయూరిసెంటర్‌: పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యలుగా నిలయాలుగా మారడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రతీసారి మరమ్మతుల పేరిట అంచనాలు సిద్ధం చేస్తున్నా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోవడంపై విమర్శలు వస్తున్నారు. ప్రత్యేక అధికారులు, ఇంజనీర్లు వసతిగృహాల్లో సమస్యలు, చేపట్టాల్సిన మరమ్మతులపై ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నా.. పరిష్కారం దక్కడం లేదు.

రెండేళ్లుగా అదే తంతు..

జిల్లాలోని పలు సంక్షేమ వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కరువై, భవనాలు దెబ్బతిన్న విషయాన్ని అధికారులు గుర్తించి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఏయే మరమ్మతులు చేపట్టాలి, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాల పునరుద్ధరణకు ఎంత ఖర్చవుతుందనే అంశంపై ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి అంచనాలు తయారుచేశారు. ఒక్కో శాఖకు సంబంధించి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నిధులు అవసరమని ప్రతిపాదించినా నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇక గిరిజన వసతిగృహాలకు సంబంధించి స్వయంగా ఐటీడీఏ పీఓ పరిశీలన చేసినప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదని తెలుస్తోంది. ప్రతిపాదనలు పంపడమే తప్ప నిధులు మంజూరు చేయించడంలో స్థానిక యంత్రాంగం విఫలమవుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.

భయం గుప్పిట్లో విద్యార్థులు

గత కొన్నేళ్లుగా హాస్టల్‌ భవనాల నిర్వహణ లోపించి గోడలు బీటలు వారాయి. వర్షాకాలం వస్తే పైకప్పు నుంచి నీరు కారుతూ విద్యార్థులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అంతేకాక పలు హాస్టళ్లలో మరుగుదొడ్లు, స్నానాల గదుల తలుపులు ఊడిపోయి, అపరిశుభ్రంగా మారాయి. అలాగే, విద్యుత్‌ వైరింగ్‌ దెబ్బతిని ప్రమాదకరంగా మారగా.. వసతిగృహాలు రంగులు వెలిసిపోయి కళ కోల్పోయాయి. ఈనెల 12 నుండి ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు తెరుచుకోనున్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో ఈసారి కూడా విద్యార్థులు సమస్యలతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మళ్లీ గుర్తింపు!

గతంలో తయారు చేసిన అంచనాలు ఏమయ్యాయో తెలియదు కానీ ప్రస్తుతం అధికారులు వసతి గృహాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను గుర్తించే పనిలో పడ్డారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యాన ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల జాబితా సిద్ధం చేస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పనులను గుర్తిస్తున్నారు. అత్యవసరంగా చేయాల్సిన పనులు, వారం పది రోజుల్లో పూర్తి చేయాల్సిన పనులు అంటూ రెండు, మూడు జాబితాలను రూపొందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement