ఖమ్మం అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన ఖమ్మం అల్లీపురంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి టీటీడీ అంగీకరించగా, అధికారులు స్థల పరిశీలన పూర్తిచేశారు. ఆపై స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఈనేపథ్యాన టీటీడీకి ధంసలాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 408లో కేటాయించిన 20.04ఎకరాల భూమికి ఖమ్మం అర్బన్ సర్వేయర్ నాగేశ్వరరావు, ఆర్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యాన శుక్రవారం హద్దులు నిర్ధారించారు. ఆపై స్థలపత్రాలను టీటీడీ సర్వేయర్ హరినాథ్, ఉద్యోగులు చెలికాని జగన్మోహన్‌రావు, బాలాజీకి అప్పగించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రావూరి సైదుబాబు తదితరులు పాల్గొన్నారు.


