● డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్
తల్లాడ/సత్తుపల్లి టౌన్: ప్లాస్టిక్‌ను నిర్మూలించడంతో పాటు విరివిగా మొక్కలు నాటితేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా అటవీ శాఖాధికారి అనూజ్ అగర్వాల్ తెలిపారు. తల్లాడ మండలం గూడూరు బీట్‌లో హైడెన్సిటీ ప్లాంటేషన్‌లో భాగంగా శుక్రవారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. కాలుష్య నివారణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలని సూచించారు. అనంతరం గూడూరు వన సంరక్షణ సమితి సభ్యులు తయారు చేసిన ప్లాస్టిక్ రహిత విస్తరాకులను పరిశీలించి అభినందించారు. ఆపై మువ్వ గూడూరు నుంచి వెంకట్రామునితండా వరకు ర్యాలీ నిర్వహించారు. తల్లాడ ఫారెస్ట్ రేంజ్ అదికారి ఉమ, వెంగన్నపేట సర్పంచ్ బి.మౌనిక, డీఆర్‌ఓలు రవికుమార్, సురేష్‌కుమార్, ఎఫ్‌ఎస్‌ఓ కిషోర్, ఎఫ్‌బీఓ ఉమామహేశ్వర్, ఉద్యోగులు అజమ్ ఆలీ, స్వాతి, బీమా, చందర్, అరుణ, లావణ్య, రమేష్, వీరభద్రం, మస్తాన్, కేశవ్, పుల్లాచారి, శ్రీకాంత్, లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం డీఎఫ్‌ఓ సత్తుపల్లిలోని ఫారెస్ట్ డివిజనల్ కార్యాలయాన్ని సందర్శించి నీలాద్రి అర్బన్‌పార్క్, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. రేంజర్ సీహెచ్.ఎల్లయ్య, ఏఓ స్వామి, డీఆర్‌ఓ నాగరాజు, వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్ దీపక్ పాల్గొన్నారు.
కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధం కావాలి
నేలకొండపల్లి: కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధం కావాలని గురుకులాల మల్టీజోనల్ ఆఫీసర్ అరుణకుమారి సూచించారు. నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, గురుకులంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఎస్సెస్సీ, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడాన్ని అభినందించిన అరుణకుమారి, ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతాయని తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 20నుంచి
గెలల సేకరణ
వేంసూరు: మండంలోని కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఈ నెల 20నుంచి ఆయిల్ పామ్ గెలలు సేకరించనున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. ఫ్యాక్టరీ పనులను శుక్రవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. ఈ ఏడాదిలోనే ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులోకి రానుందని, తద్వారా రైతులకు దూరాభారం తప్పుతుందని తెలిపారు. కాగా, వాతావరణ పరిస్థితులు దృష్ట్యా సంప్రదాయ పంటలకు బదులు ఆయిల్‌పామ్ తదితర ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ పవన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాసరి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పుచ్చకాయల సోమిరెడ్డి, మందపాటి రాఘవరెడ్డి, కనమతరెడ్డి రంగరెడ్డి, భానుప్రకాష్ పాల్గొన్నారు.
విధుల్లో చేరిన డీఈఓ
ఖమ్మం సహకారనగర్: గత ఇరవై రోజులుగా సెలవులో ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ శుక్రవారం విధుల్లో చేరారు. విద్యాసంవత్సరం మొదలుకానున్న నేపథ్యాన ఆమె పాఠశాలల్లో జరుగుతున్న పనులు, ఇతర కార్యకలాపాలపై దృష్టి సారించనున్నారు.


