జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వానలు
కొన్నిచోట్ల చల్లబడిన వాతావరణం
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వాతావరణంలో శుక్రవారం మార్పులు చోటు చేసుకున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. దీంతో కొద్ది రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జిల్లా వాసులకు ఉపశమనం లభించినట్లయింది. తెలంగాణ మీదుగా ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండగా, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 3గంటల నుంచి సుమారు గంట పాటు పలుప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఏన్కూరులో అత్యధికంగా 36.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 25.5, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో 20.3, బచ్చోడు, ముదిగొండలో 14, పల్లెగూడెంలో 13, నేలకొండపల్లిలో 10.5, ఖానాపురంలో 6.8, పెద్దగోపతిలో 6.5, తిరుమలాయపాలెంలో 2.3, కూసుమంచి, రఘునాథపాలెం, గౌరారంలో 1.5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
రోజంతా ఎండ
జిల్లా అంతటా శుక్రవారం సాయంత్రం వరకు ఎండ దంచి కొట్టింది. అత్యధికంగా మధిరలో 42.8 డిగ్రీలుగా నమోదైంది. అలాగే, కుర్నవల్లి, ఖానాపురంలో 42.7, ఎర్రుపాలెంలో 42.4, సిరిపురంలో 42.3, పమ్మిలో 42.1, బాణాపురంలో 41.8, చింతకానిలో 41.7, బచ్చోడు, నేలకొండపల్లిలో 41.5, ఖమ్మం ఎన్‌ఎస్‌పీ, పల్లెగూడెంలో 41.4, ప్రకాష్‌నగ ర్ 41.3, రావినూతల, ముదిగొండలో 41.2, గుబ్బ గుర్తిలో 41.1, కొణిజర్ల, తిమ్మారావుపేట, పెనుబల్లి, గంగారంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కానీ ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో వర్షం కురవగా జనం ఊపిరి పీల్చుకున్నారు.


