ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు మెరుగయ్యేలా చూస్తూ పునర్‌వైభవానికి కలిసికట్టుగా కృషి చేస్తామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం లోక్‌సభ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలోని బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ గత ఏడాది రూ.13.90 కోట్ల నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఏడాది రూ.8.6కోట్ల లాభాల్లోకి వచ్చిందని, వచ్చే ఏడాది రూ.25 కోట్లకు పెరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం తీరు ప్రైవేట్ సంస్థలకు లబ్ధి జరిగేలా ఉందని, దేశమంతా 5జీ వైపు దూసుకువెళ్తుంటే బీఎస్‌ఎన్‌ఎల్‌లో మాత్రం 4జీ, 5జీ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఐటీ, టెలికమ్యూనికేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తాను సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నానని తెలిపారు. గుండా ల తదితర అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ మెరుగుపడేలా టవర్లను అప్‌గ్రేడ్ చేయాలని, అవసరమైన చోట కొత్త టవర్ల ఏర్పాటుకు అటవీ అనుమతులు వచ్చేలా రెండు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడతానని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు పూర్తి వివరాలతో నివేదిక ఇస్తే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధిస్తామని తెలిపారు. అనంతరం ఎంపీలను, టీఏసీ సభ్యులు అధికారులు సత్కరించారు. ఈ సమావేశంలో సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.వెంకటేశం, టీఏసీ సభ్యులు యాస వెంకటేశ్వర్లు, షేక్ ఇమామ్, పల్లెల రామలక్ష్మయ్య, మచ్చ రామారావు, బోదాసు కనకరాజు, బానోత్ రంజిత్‌కుమార్, ఉమ్మినేని కృష్ణ, అమరవాయి సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
టీఏసీ సమావేశంలో ఎంపీలు వద్దిరాజు,
రఘురాంరెడ్డి


