అటు పాలు.. ఇటు పెట్రోల్‌ ! | - | Sakshi
Sakshi News home page

అటు పాలు.. ఇటు పెట్రోల్‌ !

Jun 5 2026 12:42 AM | Updated on Jun 5 2026 12:42 AM

సీఎన్‌జీతో పాటు చార్జింగ్‌,

వాషింగ్‌స్టేషన్లు కూడా..

ఐఓసీకి ఎకరం కేటాయింపుపై

ప్రతిపాదనలు

అన్నీ ఒకేచోట

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని విజయ డెయిరీ ఆవరణలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. పాడి పరిశ్రమ యూనిట్‌ ఆవరణ ప్రధాని రహదారికి ఆనుకుని ఉండడం, ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్న నేపథ్యాన దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బంక్‌ ఏర్పాటు కోసం కోసం లీజ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఖమ్మం రోటరీనగర్‌లోని పది ఎకరాల విస్తీర్ణంలో పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థను ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలో పాల సేకరణ, నిల్వ, ప్యాకెట్ల తయారీ తదితర యూనిట్లు కొనసాగుతున్నాయి. అంతేకాక కార్యాలయాలు, ఉద్యోగుల క్వార్టర్లు కూడా నిర్మించినా ఇంకా చాలా స్థలం ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇది డిమాండ్‌ ఉన్న స్థలం కావడంతో బంక్‌ ఏర్పాటుకు కేటాయిస్తే అదనపు ఆదాయం లభిస్తుందని.. మరోపక్క అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవచ్చనే భావనకు అధికారులు వచ్చినట్లు తెలిసింది.

ఎకరం కేటాయింపు

డెయిరీ ఆవరణలోని ఎకరం స్థలాన్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ)కు చెందిన కార్యకలాపాలకు కేటాయించే అంశాన్ని రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ పరిశీలిస్తుంది. ఇప్పటికే ఐఓసీ కంపెనీ ప్రతినిధులు ప్రాంగణాన్ని పరిశీలించి వెళ్లారు. బంక్‌ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉందని వారు నిర్ధారణకు వచ్చిన నేపథ్యాన త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని ఉందని తెలిసింది. ఈక్రమంలోనే డెయిరీ ప్రాంగణాన్ని ఆనుకుని ఏర్పాటైన కూరగాయలు, కొబ్బరి బోండాలు తదితర వ్యాపారులను ఖాళీ చేయించి వారి డబ్బాలు తొలగించడం మొదలుపెట్టారు.

సంస్థకు ఆదాయం

ఖమ్మం – వైరా ప్రధాన రహదారిపై పాడి పరిశ్రమకు చెందిన రూ.కోట్ల విలువైన ఎకరాల భూమి నిష్ప్రయోజనంగా మారింది. ఇప్పటికే చిరువ్యాపారులు డబ్బా కొట్టు ఏర్పాటుచేసుకున్నారు. ఇదిలాగే వదిలేస్తే భూమి అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉండడంతో పాడి పరిశ్రమకు ఆదాయాన్ని రాబట్టేలా లీజ్‌కు ఇవ్వాలని, తద్వారా అద్దె కూడా వస్తుందని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే విజయ డెయిరీ వెంట 11షాపులు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా నెలకు రూ.2లక్షల మేర ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఐఓసీకి ఎకరం స్థలం కేటాయిస్తే ఆదాయం మరింత పెరగడమే కాక స్థలానికి భద్రత ఉంటుందని భావిస్తున్నారు.

డెయిరీ ప్రాంగణంలో

బంక్‌ ఏర్పాటుకు ప్రణాళిక

ఐఓసీ కంపెనీ డెయిరీ ప్రాంగణంలో మల్టీపర్పస్‌ బంక్‌ను ఏర్పాటుచేసే అవకాశముందని సమాచారం. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ(కంప్రెస్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌) స్టేషన్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అంతేకాక విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు, వాషింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే పాడి పరిశ్రమ – ఐఓసీ మధ్య స్థలం లీజ్‌ ఒప్పందం కుదిరే అవకాశముంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement