పారిశుధ్య లోపం.. నగరానికి శాపం | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య లోపం.. నగరానికి శాపం

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

సాక్షి బళ్లారి: పేరుగొప్ప ఊరుదిబ్బ అంటే ఇదేనేమో. స్టీల్‌ సిటీగా పేరుగాంచిన బళ్లారి నగరంలో పలు రోడ్లలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగునీరు సర్వసాధారణంగా కనిపిస్తోంది. అసలే ఇటీవల వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మురుగునీరు డ్రైనేజీల్లో నుంచి రోడ్లపైకి వస్తున్నాయి. చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇంటింటికీ చెత్తసేకరణ వాహనాలు వెళ్తున్నప్పటికీ పలువురు రోడ్లలోనే చెత్తాచెదారం వేస్తున్నారని పాలికె అధికారులు పేర్కొంటున్నారు. అయితే వారానికి ఒక్కసారి కూడా చెత్తసేకరణ వాహనాలు రాకపోవడంతో రోడ్ల పక్కనే చెత్తాచెదారం పారవేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయా కాలనీల్లో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లలో చెత్తాచెదారం విపరీతంగా వేయడం వల్ల పాదచారులకు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి, ఆయా కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డ్రైనేజీల్లో మురుగు నీటితో పాటు చెత్తాచెదారం చేరడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు.

రోడ్ల పక్కనే చెత్తాచెదారం

నగరంలోని కణేకల్లు బస్టాండు నుంచి పెద్ద మార్కెట్‌కు వెళ్లే దారిలో నిత్యం రోడ్లలో చెత్తాచెదారం వేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానగర పాలికె సిబ్బంది, నగర పరిశుభ్రతపై దృష్టి సారించేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో నగరంలోని పలు వీధుల్లో చెత్తాచెదారం వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది కొరత సగానికి సగం తక్కువగా ఉన్నప్పటికీ నగర స్వచ్ఛతకు కృషి చేస్తున్నామని పాలికె అధికారులు పేర్కొంటున్నారు. నగరంలో చెత్త సేకరణ వాహనాలు కాలనీల్లోకి రాకపోతే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు మినహా పలు మురికి వాడల కాలనీల్లో చెత్తాచెదారంతో పాటు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో దోమల బెడద మరింతగా ఎక్కువ అవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు నగరంలోని రోడ్లలో వేస్తున్న చెత్తాచెదారాన్ని అరికట్టి డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు నీటిని ఎప్పటికప్పుడు పారేలా శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్ల పక్కనే చెత్తాచెదారం

డ్రైనేజీల్లో నిలిచిన మురుగు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement