బళ్లారి టౌన్: అభివృద్ధిలో తిరోగమనంలో ఉన్న భారతదేశాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలోకి తీసుకెళ్లారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని మోకా రోడ్డులోని వాజ్‌పేయి లేఔట్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వైఎం.సతీష్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల పాలనలో భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిందని, ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత వంటి కీలక రంగాల్లో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధాన మంత్రుల్లో మోదీ మొదటి స్థానంలో నిలిచారన్నారు. ప్రజల వి శ్వాసాన్ని పొందుతూ పాలనలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆ ర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్ర భుత్వం నిరంతరంగా కృషి చేస్తోందని కొనియాడారు.
ఉగ్రవాదం, నక్సలిజంపై కఠిన వైఖరి
ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అణచివేసేందుకు మోదీ తీసుకుంటున్న చర్యలు యావత్ దేశ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న నిర్ణయాలే ప్రధాన కారణమన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగాలని, పరిశుభ్రమైన ఓటరు జాబితా రూపకల్పన ప్రజాస్వామ్యానికి అత్యవసరమన్నారు. కొన్ని సంస్థలు, పార్టీలు అశాంతిని సృష్టించేందుకు ఉద్యమాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందా? లేదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, బీజేపీ ప్రముఖులు కేఎస్ దివాకర్, హనుమంతప్ప పాల్గొన్నారు.
ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతలో పురోగతి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి


