● రైతుల నిరసన
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురంలో కలెక్టర్ కార్యాలయం వద్ద భారత్ పెట్రోల్ బంక్‌లో రైతులు, డ్రైవర్లు నిరసనకు దిగారు. ట్రాక్టర్లు, టిల్లర్‌లను తీసుకువచ్చి బంక్ ముందు నిలబెట్టి ధర్నా చేశారు. వ్యవసాయ అవసరాల కోసం క్యాన్లను తీసుకువచ్చి డీజిల్ అడిగితే ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. రహదారి– 234 లో వాహనాలను అడ్డగించడంతో ఉద్రిక్తత నెలకొంది. బంక్ యజమాని సందీప్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వచ్చి వాహనాలను అడ్డు తీయాలని కోరినా రైతులు వినలేదు. పొలం పనుల్లో ఉండగా ట్రాక్టర్లకు డీజిల్ అయిపోతే క్యాన్లు తీసుకుని వస్తామని, కానీ డీజిల్ పోసేది లేదని చెబుతున్నారని ఆరోపించారు. చివరకు పోలీసులు రైతులకు నచ్చచెప్పి రోడ్డును ఖాళీ చేయించారు.
బెళగావిలో హెల్మెట్ అభియాన్
దొడ్డబళ్లాపురం: హెల్మెట్ ధరించని బైకిస్టులకు పెట్రోల్ విక్రయించరాదని కోరుతూ బెళగావి సిటీ పోలీస్ కమిషనర్ భూషణ్ బోర్సే పెట్రోల్ బంకు యజమానులను లేఖ రాశారు. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఎన్ని రూల్స్ పెట్టినా బైకిస్టులు పట్టించుకోవడం లేదని కమిషనర్ ఈ నిర్ణయానికి వచ్చారు. పోలీసుల సమాచారం ప్రకారం బెళగావిలో గత 10ఏళ్లలో హెల్మెట్ ధరించని కారణంగా 2,282 రోడ్డు ప్రమాదాలు జరగగా 358 మంది మృతిచెందారు. 1,492 మంది గాయపడ్డారు. సిటీలో వారం రోజులపాటు హెల్మెట్ జాగృతి అభియాన్ చేపట్టనున్నారు. సోమవారంనాడు ఈ అభియాన్‌లో ఐజీపీ సందీప్ పాటిల్ హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.
వెనక్కి తగ్గిన అటవీ శాఖ
● ఫుట్‌పాత్‌కు విముక్తి
శివమొగ్గ: అటవీ శాఖ కార్యాలయ సిబ్బంది ఫుట్‌పాత్‌ని ఆక్రమించడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కొంత దూరంలో, ఆర్టీఓ కార్యాలయం పక్కనే ఉన్న కర్ణాటక అటవీ అభివృద్ధి సంస్థ ఫుట్‌పాత్‌ను ఆక్రమించింది. దానిపై పెద్ద బోర్డును పాతింది. దీని కారణంగా, పాదచారులు ఆ ప్రాంతంలో నడవలేకపోతున్నారు. ఈ సమస్యపై ప్రముఖ జర్నలిస్ట్ బి. రేణుకేష్ రాసిన వార్తలు ప్రజల్లో చర్చను రేకెత్తించాయి. ఆక్రమణను తొలగించాలని డిమాండ్ వచ్చింది.
ట్రాఫిక్ పోలీసుల చర్యతో..
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ దేవరాజ్, సిబ్బంది కలిసి ఆక్రమణ స్థలంలోని అటవీశాఖ బోర్డును తొలగించాలని నిర్ణయించారు. ఇది తెలిసి అటవీ సిబ్బందే ఆదివారం దానిని తొలగించినట్లు తెలిసింది. అటవీ సిబ్బందే కబ్జాలకు పాల్పడితే ఎలా అని జనం ప్రశ్నించారు.
మంటల్లో గ్యాస్ గిడ్డంగి
దొడ్డబళ్లాపురం: సిలిండర్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా సిలిండర్లు పేలిపోయి ఉవ్వెత్తున మంటలు లేచాయి. దావణగెరె తాలూకా హెచ్ కల్లహళ్లిలో శివారులో వక్క తోటలో శివకుమార్ అనే వ్యక్తి గోదాము ఉంది. మంటలు అంటుకుని 8 సిలిండర్లు పేలడంతో తీవ్రత అధికమైంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని దావణగెరె ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
రక్తదాతలకు సన్మానం
చిక్కబళ్లాపురం: భారతీయ రెడ్ క్రాస్ సంస్థ సేవలు శ్లాఘనీయం అని జిల్లా కలెక్టర్ జి.ప్రభు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ భవనంలో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిన విశ్వరక్తదాన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.06 లక్షల మంది నుంచి రక్తదానం చేయించడం గొప్ప విషయమని అభినందించారు. ప్రతి ప్రభుత్వ శాఖ సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించాలని తాను సూచిస్తానన్నారు. ఎస్పీ కుశాల్ చౌక్సె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ రక్తదాతలను సన్మానించారు.


