రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో అంగన్‌వాడీలకు ఆదరణ పెరుగుతోంది. ఎల్‌కేజీ, యూకేజీలో చిన్నారులను చేర్పించేందుకు తలిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 200 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. గ్రామీణ ప్రాంతాల్లో విశేష స్పందన లభిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, డొనేషన్లు చెల్లించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో రాయచూరులో 96, లింగసుగూరు 232, మాన్వి 181, సిరవార 164, సింధనూరు 211, తుర్విహాళ్ 183, లింగసుగూరు–మస్కి పరిధిలో 441, దేవదుర్గలో 419 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సొంత భవనాలు ఉండి ఎంపిక చేసిన 200 కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు.
అందుబాటులో బోధన సామగ్రి
ప్రస్తుతం రాయచూరు పరిధిలోని 32 కేంద్రాల్లో 313 మంది, లింగసుగూరు తాలూకాలోని 8 కేంద్రాల్లో 195 మంది, మాన్వి తాలూకాలోని 20 కేంద్రాల్లో 556 మంది, సిరవార తాలూకాలోని 15 కేంద్రాల్లో 395 మంది, సింధనూరు తాలూకాలోని 20 కేంద్రాల్లో 592 మంది, తుర్విహాళ్ తాలూకాలోని 25 కేంద్రాల్లో 457 మంది, లింగసుగూరు–మస్కి తాలూకాలోని 40 కేంద్రాల్లో 792 మంది, దేవదుర్గ తాలూకాలోని 40 కేంద్రాల్లో 753 మంది చిన్నారులు ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా పరికరాలు, ఆట బొమ్మలు, బోధన సామగ్రి అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం..
రాబోవు విద్యా సంవత్సరం (2027–28) నుంచి మరో 300 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం స్పందించి తరగతుల ప్రారంభానికి అనుమతి లభిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత మంది చిన్నారులకు ప్రాథమిక విద్య అందుబాటులోకి రానుంది. – శరణమ్మ,
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి
ఎల్‌కేజీ, యూకేజీలో చిన్నారులను చేర్పించేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య


