కోలారు: నగరంలోని కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాష్ట్ర త్రిచక్ర వాహన సంఘం ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి కేంద్రం, ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నగర సభ నోడల్ అధికారి నవీన్ చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ యుద్ధం పరిణామంగా ఇంధన ధరలు పెరిగి ఆటో డ్రైవర్ల జీవనం కష్టంగా మారిందన్నారు. వంట గ్యాస్ ధరలు పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోడ్రైవర్లు స్వయం ప్రేరితంగా తాగునీటి యూనిట్‌ను ప్రారంభించి ఉచితంగా తాగునీటి వ్యవస్థ కల్పించడం సంతోషకరమన్నారు. అసంఘటిత కార్మిక పరిషత్ అధ్యక్షుడు కె.వి.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. సుమారు 40 సంవత్సరాల పోరాట ఫలితంగా ప్రభుత్వ స్థాయిలో కర్ణాటక రాష్ట్ర వాణిజ్య వాహన డ్రైవర్ల సంక్షేమ మండలి ఏర్పాటైనట్లు వెల్లడించారు. రిజిష్టర్ అయిన ఆటో డ్రైవర్లకు సామాజిక భదతా పథకాలు అమలవుతున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డు పొందిన డ్రైవర్ల పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ సభ్యుడు డెకోరేషన్ కృష్ణ, ఎన్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.


