● యువ రైతు అవయవదానం
మండ్య: బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స ఫలించక కోమాలోకి వెళ్లిన యువ రైతు అవయవాలను దానం చేయడం ద్వారా మృతుని తల్లిదండ్రులు మానవత్వం ప్రదర్శించారు. వివరాలు.. తాలూకాలోని క్యాతఘట్ట గ్రామానికి చెందిన గిరి గౌడ అలియాస్ రంజిత్ (32) ఈ నెల 11న బైక్‌పై వెళుతుండగా ఆలభోజనహళ్లి వద్ద మరో స్కూటరిస్టు వేగంగా ఢీకొన్నాడు. గిరి గౌడ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని మైసూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే బ్రెయిన్‌డెడ్‌లోకి చేరుకున్న గిరి గౌడ చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తేల్చారు. అవయవాలను దానం చేయాలని వైద్యులు కోరగా, అంత దుఃఖంలోనూ తల్లిదండ్రులు అంగీకరించారు. విధివిధానాలను పూర్తి చేసి అతని అవయవాలను తీసుకున్న తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో గిరి గౌడ అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా కుటుంబ సభ్యుల మానవతను గ్రామస్తులు ప్రశంసించారు.
రైతన్న ఉగ్రరూపం
● పరిహారం ఇవ్వలేదని దాడి
దొడ్డబళ్లాపురం: ముంపునకు గురైన భూమికి పరిహారం ఇవ్వకుండా సతాయిస్తుండడంతో అన్నదాత ఉగ్రరూపం దాల్చాడు. విసిగిపోయిన బాధితుడు బీటీడీఏ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన సంఘటన బాగలకోటలోని నవనగరలో ఉన్న బాగలకోట టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో జరిగింది. సఫాయి కర్మచారులకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో బీటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమయంలో వారితో పాటు లోపలకు వెళ్లిన రైతు బసప్ప దొడ్డమని తనకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదంటూ హఠాత్తుగా చెప్పు తీసుకుని ఓ ఉద్యోగిని చితకబాదాడు. ఈ చర్యతో అందరూ అవాక్కయ్యారు. తరువాత మాట్లాడిన రైతు బసప్ప గత నాలుగేళ్లుగా ముంపునకు గురైన తన భూమికి కావాలనే పరిహారం ఇవ్వడం లేదని వాపోయాడు.
గుంతను తప్పించబోయి.. మహిళ దుర్మరణం
బనశంకరి: బెంగళూరులో గుంతల రోడ్ల సమస్య వర్షాలకు మరింత తీవ్రరూపం దాల్చింది. నీళ్లు నిలిచి గుంతలు కనబడక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. శనివారం ఉదయం మారతహళ్లిలో స్కూటర్‌లో కుమార్తెను కాలేజీకి తీసుకెళుతుండగా జరిగిన ప్రమాదంలో నల్లూరహళ్లి నివాసి కాంత (42) అనే మహిళ దుర్మరణం చెందింది. వివరాలు.. ఉదయం 7:45 సమయంలో కాంత, కూతురు నేహను కాలేజీలో వదిలిపెట్టడానికి స్కూటర్‌లో వర్తూరు నుంచి మారతహళ్లికి బయలుదేరింది. సిద్దాపుర మీనాక్షీ లేఔట్ వద్ద రోడ్డు గుంత ఉండగా, కాంతా స్కూటర్ ను పక్కకు తిప్పడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన పాఠశాల బస్ ఢీకొట్టి ఆమె మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాంత అక్కడే మరణించింది, నేహకు స్వల్ప గాయాలయ్యాయి. వైట్‌ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వానికి తరలించారు. కళ్ల ముందే కన్న తల్లి చనిపోవడంతో కుమార్తె బోరున విలపించింది.


