బనశంకరి: బెంగళూరులో తెలుగు పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని పలువురు కోరారు. యలహంకలోని శ్రీ నీలకంఠేశ్వర ప్రాథమికోన్నత పాఠశాలలో శంకర్, సుష్మ దంపతులు, విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, మిఠాయిలు అందజేశారు. జీ.సుబ్రమణ్యం, వరదరాజు, హెచ్‌ఎం రెడ్డి రాణి పాల్గొన్నారు.
బిడది రైతులతో కలిసి
పోరాడుతా: కుమార
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో టౌన్‌షిప్ నిర్మాణం కోసం కాంగ్రెస్ సర్కారు పట్టుదలతో ఉండగా, ప్రతిపక్షాలు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. టౌన్‌షిప్‌కు తమ భూములు తీసుకోరాదంటూ పోరాటం చేస్తున్న రైతులకు కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బిడది టౌన్‌షిప్ కాంగ్రెస్ వారి పాలిట లూటీ స్కామ్‌గా మారిందన్నారు. బిడది టౌన్‌షిప్ డీకే శివకుమార్ కల కాదని, అది నా కల అని చెప్పారు. అయితే నా ఉద్దేశంలో టౌన్‌షిప్ నిర్మాణం వేరేగా ఉందని, కాంగ్రెస్ వారికి మాత్రం రియల్ ఎస్టేట్ దందా అన్నారు. డీకే శివకుమార్‌కి రైతులపై ఏ మాత్రం కనికరం లేదన్నారు. ప్రతీ పనికి ముందు సీఎం డీకే శివకుమార్ అజ్జయ్య స్వామి వద్ద కు వెళ్తారని, రైతులకు అన్యాయం చేయమని అజ్జయ్య చెప్పాడా అని ప్రశ్నించారు. టౌన్‌షిప్‌కి వ్యతిరేకంగా రైతులతో కలిసి తాను, జేడీఎస్ పోరాటం చేస్తామని తెలిపారు.
చిన్నారి కూతుళ్లను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం
మైసూరు: ఎంత కష్టం వచ్చిందో కానీ ఆ తల్లి కిరాతకురాలిగా మారింది. మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకా, జవరేగౌడ కొప్పలు గ్రామంలో ఒక మహిళ ఇద్దరు చిన్నారి కుమార్తెలకు ఉరి వేసి హత్య చేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. అనిల్ కుమార్ భార్య ప్రియాంక (26), కూతుళ్లు ద్యుతి (3), దిశ (18 నెలలు). అనిల్, ప్రియాంకకు ఆరేళ్ల కిందట పెళ్లయింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె పిల్లల గొంతుకు తాడు బిగించి ప్రాణాలు తీసింది. ఆపై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొంతసేపటికి స్థానికులు గమనించి ఆమెను మైసూరులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు, ఆమె ప్రాణాలతో పోరాడుతోంది. పిల్లల మృతదేహాలను కృష్ణరాజ నగర ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఇంట్లో గొడవలే కారణం కావచ్చని అనుమానాలున్నాయి. సాలిగ్రామ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ప్రమాదాల్లో
ముగ్గురి మృతి
బనశంకరి: బెంగళూరులోని మైసూరు రోడ్డులో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి , శనివారం తెల్లవారుజామున ప్రమాదాలు జరిగాయి. కెంగేరి ఆర్‌ఆర్.డెంటల్ కాలేజీ వద్ద అతుల్, గౌరీశంకర్ అనేవారు బైక్‌లో మైసూరు నుంచి బెంగళూరుకు వస్తూ ఘటనాస్థలిలో రోడ్డు డివైడరును ఢీకొనడంతో తీవ్ర గాయాలై చనిపోయారు. వీరిద్దరూ నర్సింగ్ విద్యార్థులని తెలిసింది. కెంగేరి వద్ద రెండు ద్విచక్రవాహనాలను కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని సుఖదేవ్ (45) అనే వ్యక్తి చనిపోగా, ద్విచక్రవాహనాలలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కెంగేరి ట్రాపిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.


