బనశంకరి: వర్షాకాలంలో డెంగీ జ్వరం పొంచి ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జీబీఏ ప్రధాన ఆరోగ్యాధికారి డాక్టర్ మదని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాణాంతక డెంగీ జ్వరాలు విస్తరిస్తాయి. ఈడీస్ ఈజిప్టె అనే దోమలు కుట్టడంతో డెంగీ జ్వరం సోకుతుంది. ఈ దోమలు నిలిచి ఉన్న నీటిలో జీవిస్తూ, పగటి సమయంలో కుట్టడం వల్ల డెంగీ సోకుతుందని తెలిపారు.
డెంగీ లక్షణాలు ఇలా
తీవ్రమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కంటినొప్పి, కండరాలు నొప్పులు డెంగీ ప్రధాన లక్షణాలు. వాంతులు, విరేచనాలు కూడా కనిపిస్తాయి. డెంగీ తీవ్రస్థాయిలోకి చేరుకున్న సమయంలో నోరు, ముక్కు నుంచి రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది.
పరిశుభ్రత ప్రధానం
డెంగీ నియంత్రణకు ఇంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో నీరునిల్వకుండా చూసుకోవాలి. సిమెంటు తొట్టెలు, డ్రమ్ములు, గొట్టాలు, టైర్లు, చిప్పలు పూలకుండీలు, తట్టలు, గుంతలు తదితరాలలో నీరు నిలవకుండా, దోమలు పెరగకుండా చూసుకోవాలి. అటువంటి స్థలాలను శుభ్రం చేయాలని సూచించారు. ఇళ్లలో దోమతెరలు, కాయిల్స్ తదితరాల ద్వారా దోమ కాటు నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఎలాంటి జ్వరలక్షణాలు కనబడిన తక్షణం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి , పాలికే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాలని తెలిపారు.
ప్రతి వర్షాకాలంలో
బెంగళూరుకు తలనొప్పి


