హొసపేటె: గతసారి కూడ్లిగి నియోజకవర్గం నుంచి, ఈసారి మొళకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్‌వై గోపాలకృష్ణ ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్‌లో ఎన్‌వై గోపాలకృష్ణకు చోటు కల్పించాలని కూడ్లిగి తాలూకాకు చెందిన ఎన్‌వైజీ అభిమాన సంఘం కేపీసీసీని, ఏఐసీసీని డిమాండ్ చేసింది. ఆయన కూడ్లిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉండి తాలూకా పరిపాలన భవనంతో పాటు అనేక రోడ్లు, పాఠశాలలను నిర్మించారు. కూడ్లిగి నియోజకవర్గంలో రూ.680 కోట్ల గ్రాంటుతో 74 చెరువులకు శాశ్వత పరిష్కారం చూపిన గోపాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని కూడ్లిగి ఎన్‌వైజీ అభిమానుల సంఘం ఒత్తిడి చేసింది. పార్టీ నేతలు ప్రకాష్, బళ్లారి జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు గుండుముణుగు తిప్పేస్వామి, జేడీఎస్ కొట్టూరు ఎంఎంజే హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
గైర్హాజరు పీడీఓలకు
నోటీసులు జారీ
రాయచూరు రూరల్: ప్రభుత్వ విధులు నిర్వహించాల్సిన అధికారులు ఇళ్లలో కూర్చొని బయోమెట్రిక్‌లో హాజరు వేస్తున్న అంశం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి వచ్చింది. ఏకంగా 105 మంది గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) విధులకు గైర్హాజరైన విషయం యాదగిరి జెడ్పీ సీఈఓ లవీష్ ఒడెయర్ పరిశీలనలో వెలుగు చూసింది. ఈనేపథ్యంలో వారందరికీ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది రాయచూరు జిల్లాలో పంచాయతీ నిధులు దుర్వినియోగపరిచిన పీడీఓలను విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు విదితమే.
50 మోటార్ సైకిళ్లు స్వాధీనం
● ఐదుగురు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్ : జిల్లాలోని బళగానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 50 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మస్కికి చెందిన చెన్నబసవ, రాఘవేంద్ర, గిండి రఘు, మెహబూబ్, మహ్మద్‌లాల్, రఫీక్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.35.20 లక్షల విలువైన బైక్‌లను జప్తు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, ఎస్‌ఐ ఎరియప్ప తదితరులు పాల్గొన్నారు.
16 నుంచి కృత్రిమ అవయవాల శిబిరం
హొసపేటె: కొప్పళ నగరంలోని ముస్లిం షాదీ మహాల్‌లో ఈనెల 16 నుంచి 18 వరకు ఉచిత జైపూర్ కృత్రిమ కాళ్ల జోడింపు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఎంఎస్‌పీఎల్ సంస్థ సామాజిక సేవా విభాగం ఉపాధ్యక్షుడు హెచ్‌కే.రమేష్ తెలిపారు. ప్రెస్ క్లబ్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగర, బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిబిరంలో శిబిరార్థులకు ఉచిత భోజనం, వసతి, కృత్రిమ అవయవాలు అందిస్తారని ఆయన అన్నారు. ఆ శిబిరం లబ్ధి పొందాలని ఆయన కోరారు. కంపెనీ సీఎస్‌ఆర్ విభాగం సీఈఓ అశ్విన్‌కుమార్, కంపెనీ ఎండీ బీఎం నాగరాజ్, కృష్ణ పాల్గొన్నారు.
బాల కార్మికత పారదోలదాం
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో బాల కార్మికతను పారదోలదామని కన్నడ సాహిత్య ప్రాధికార కార్యదర్శి దండెప్ప బిరాదార్ పిలుపునిచ్చారు. శనివారం తాలూకాలోని ఉడుంగల్ ఖానాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాల కార్మిక నియంత్రణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలలపై అధికంగా పని ఒత్తిడి పడుతుందని, దాని నివారణకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. వీరేష్, సన్నిధి, సుశ్మిత, శ్రేయ, అఖిల్‌లున్నారు.
వీధి కుక్కల బెడద అరికట్టండి
రాయచూరు రూరల్: నగరంలో వీధి కుక్కల బెడద అరికట్టాలని కరవే డిమాండ్ చేసింది. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఖలీల్‌పాషా మాట్లాడారు. ఇటీవల పలు కాలనీల్లో వీధుల్లో సంచరించే కుక్కలు కరిచి పలువురు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారన్నారు. వీధి కుక్కలకు సంతాన హరణ చికిత్సలు చేయాలన్నారు. గంగా నివాస్ వద్ద ఐదుగురు బాలలను కుక్కలు కరిచాయని గుర్తు చేశారు. వాటిని పట్టి నగరం నుంచి వెలుపలకు దూరంగా తరలించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
నెట్టికంటుడికి బళ్లారి భక్తుడు
రూ.1.50 లక్షల విరాళం
గుంతకల్లు రూరల్: తన తండ్రి హనుమప్ప జ్ఞాపకార్థం కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన గుర్రప్ప కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.1.50 లక్షల విరాళాన్ని శనివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యుల పేరిట ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.


