ఛాయారత్న అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ఛాయారత్న అవార్డు ప్రదానం

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

బళ్లారిటౌన్‌: నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్‌ బీఎం రుద్రముని స్వామికి కర్ణాటక ఛాయారత్న అవార్డు లభించింది. కర్ణాటక వీడియో, ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్‌, రాష్ట్ర పత్రికా ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ స్థాయి ఫోటో, వీడియో ప్రదర్శనలో తనను అవార్డుతో సన్మానించినట్లు తెలిపారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు హెచ్‌వీ.కృష్ణప్ప, కార్యదర్శి జగదీష్‌, కే.దేవరాజు పాల్గొన్నట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో ఆవు, దూడ బలి

బళ్లారిటౌన్‌: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో తెగి పడిన విద్యుత్‌ తీగలను ఆవు, దూడ తాకడంతో ఉన్న ఫళంగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుడు పోతురాజుకు చెందిన ఓ ఆవు, దూడ ఆ పరిసరాల్లో మేత మేయడానికి వెళ్లి తెగి పడిన విద్యుత్‌ తీగలను తాకి అక్కడే విలవిలా కొట్టుకొని చనిపోయాయి. కాగా తెగి పడిన విద్యుత్‌ వైర్ల మరమ్మతులపై కేపీటీసీఎల్‌ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. శనివారం గ్రామ ప్రముఖులు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దృష్టికి తేవడంతో అధికారులు హుటాహుటిన వచ్చి పరిశీలించారు. ఈ ప్రాంతంలో బ్రాందీ షాపుతో పాటు వివిధ పాఠశాలలకు వెళ్లే వాహనాలు నిత్యం భారీ సంఖ్యలో తిరుగుతుంటాయని, అధికారులు ఈవైపు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

అతిగా ఎనర్జీ డ్రింక్‌ తాగి యువకుడు మృతి

రాయచూరు రూరల్‌: ఇటీవలి రోజుల్లో యువకులు ఎనర్జీ, కూల్‌డ్రింక్‌లను తాగడం అధికమైంది. రసాయన పదార్థాలతో తయారు చేసిన కిరాణ దుకాణాల్లో విక్రయిస్తున్న ఓ ఎనర్జీ డ్రింక్‌ను అతిగా తాగిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఎనర్జీ డ్రింక్‌ను అతిగా తాగడం అలవాటు చేసుకున్న యాదగిరి జిల్లా సురపుర తాలూకా నారాయణపురకు చెందిన బాలప్ప(18) అనే యువకుడు కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. అనారోగ్యం బారిన పడిన అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. దీనిని సహించలేక కుటుంబ సభ్యులు దుకాణాల్లో ఉన్న ఆ ఎనర్జీ డ్రింక్‌ సీసాలను ధ్వంసం చేశారు.

విద్యార్థులకు

పాఠ్యపుస్తకాల పంపిణీ

బళ్లారిటౌన్‌: నగర శివార్లలోని 34వ వార్డు పరిధిలోని బత్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాజీ మేయర్‌ ఎం.రాజేశ్వరి ఉచిత పాఠ్యపుస్తకాలు, లేఖన సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు ఎం.సుబ్బరాయుడు, యోగానందరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు.

హాస్టళ్లను కొనసాగించరూ

రాయచూరు రూరల్‌: నగరంలో వెనుక బడిన వర్గాల సంక్షేమ(బీసీఎం) శాఖ ఆధీనంలోని హాస్టళ్లను యథాప్రకారం కొనసాగించాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్‌ చేసింది. శనివారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్‌ మాట్లాడారు. గతంలో ఉన్న విద్యార్థులను వేరే చోటికి బదిలీ చేయడం వల్ల అడ్డంకులు ఎదురవుతాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్టళ్లను కొనసాగించేలా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement